Home Actor అంత పెద్ద హిట్ లో నాకూ రవ్వంత భాగం ఉండడం గర్వంగా ఉంది – రచ్చ...

అంత పెద్ద హిట్ లో నాకూ రవ్వంత భాగం ఉండడం గర్వంగా ఉంది – రచ్చ రవి.

89
0

 వెంకీ-వరుణ్ తేజ్-తమన్నా-మెహెరీన్ హీరోహీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఎఫ్-2’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్బులో చేరిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్బులో స్థానం కోసం పరుగులు తీస్తోంది. ఇంత పెద్ద హిట్ లో తనకు కూడా రవ్వంత భాగం దక్కడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందంటున్నాడు రచ్చరవి.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో కలిసి నటించే అవకాశాన్నిచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని… అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంతకు ముందు ‘రాజా ది గ్రేట్’లోనూ నటించానని, దిల్ రాజు గారి బ్యానర్ లో ‘ఎం.సి.ఏ’ కూడా చేశానని, ఆ రెండూ కూడా హిట్లేనని రవి తెలిపాడు.

  ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ తో ‘రచ్చ రవి’గా మారిన వరంగల్ కు చెందిన ‘రవికుమార్ దొడ్డిపాటి’ గత పదిహేనేళ్లుగా పరిశ్రమలో పడరాని పాట్లన్నీ పడి.. మెల్లగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకొని..  ఇప్పటికి సుమారుగా 50 సినిమాల్లో నటించాడు.  తేజ ‘1000 అబద్ధాలు’ రవి పరిచయ చిత్రం. ‘ఖైదీ నంబర్ 150, శతమానం భవతి, నేనే రాజు నేనే మంత్రి’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించే అవకాశం లభించడం తన అదృష్టం అని చెప్పే రవి.. పూర్వాశ్రమంలో రేడియో జాకీ కావడం గమనార్హం.

 అది కూడా..  రవి ఆర్జేగా పని చేసింది దుబాయిలో కావడం మరింత విశేషం. ‘నవ్వుల నల్లబాలు’గా ఇప్పటికీ రవి అక్కడి వారికి సుపరిచితుడే.   తాను ఎక్కడుంటే అక్కడ తనదైన మాటల చమత్కారంతో కడుపుబ్బ నవ్వించే రవికి సరైన క్యారక్టర్ పడితే ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రవి..  పోసాని దర్శకత్వంలో ఒక సినిమా, శివాజీ రాజా తనయుడు హీరోగా పరిచయమవుతున్న ‘ఏదైనా జరగొచ్చు’తోపాటు.. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఇంకా పేరు పెట్టని సినిమాలోనూ నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here