Home Actor ఆరు నెల‌ల్లోపు మూడు ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

ఆరు నెల‌ల్లోపు మూడు ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

108
0


వ్య‌వ‌సాయం మీద ఆస‌క్తి ఉన్న యువ‌త నుంచి ల‌క్ష మంది రైతుల్ని త‌యారు చేస్తాం. అందులో అనంత నుంచి ప‌ది వేల మందికి అవ‌కాశం క‌ల్పిస్తాం. ఇజ్రాయిల్ త‌ర‌హా వ్య‌వ‌సాయ విధానాలు అమ‌లుప‌రుస్తాం అని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. అనంత‌పురంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ… కింగ‌స్ట‌న్ త‌ర‌హా టెక్నాల‌జీతో అర ఎక‌రా భూమిలో నెల‌కి న‌లుగురు, ఐదుగురికి జీవ‌నోపాధి ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. రైతుల‌కి సైన్స్ అండ్ టెక్నాల‌జీ అందుబాటులోకి తేవ‌డం ద్వారా అనంత నుంచి క‌రవుని పార‌దోలుతాం. గోదావ‌రి జిల్లాల‌కి మించి అభివృద్ది చేస్తాం.

రాయ‌లసీమ‌ని ర‌త‌నాలసీమ‌గా మార్చేందుకు జ‌ల‌వ‌న‌రుల్ని అందుబాటులోకి తెస్తాం. ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న న‌దీ జ‌లాల పంపిణీకి సంబంధించిన వివాదాల‌కు రెండేళ్ల‌లో ప‌రిష్కారం చూపుతాం. వివాదాల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక వాట‌ర్ బోర్డు ఏర్పాటు చేస్తాం. దీనికి ముఖ్య‌మంత్రి చైర్మ‌న్‌గా ఉంటాడు. కృష్ణా జ‌లాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పుని సాధ్య‌మైనంత త్వ‌రగా అమ‌లు చేస్తాం. హంద్రినీవా, తెలుగుగంగ‌, గాలేరు-న‌గ‌రి, వెలిగొండ‌, క‌ల్వ‌కుర్తి-నెట్టంపాడు త‌దిత‌ర ప్రాజెక్టుల‌కి సంబంధించి నీటి పంపిణికి ఉన్న ఆటంకాలు తొల‌గిస్తాం. సీమ మొత్తం నీటి పారుద‌ల సౌక‌ర్యాలు మెరుగుప‌ర్చి, స‌స్య‌శ్యామ‌లం చేస్తాం అన్నారు.

ఎంట్రన్స్ పరీక్షల ఫీజులతో నిరుద్యోగ భృతి

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కి పోటీ పరీక్షల పేరిట వ‌సూలు చేసే  డ‌బ్బుతోనే పాల‌కులు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇవ్వ‌ని ఉద్యోగాల‌కి ఫీజులు వ‌సూలు చేశారు. జ‌న‌సేన ప్ర‌భుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పోటీ ప‌రీక్ష‌ల‌కి ఏడాదికి ఒక్క‌సారి మాత్ర‌మే ఫీజులు క‌ట్టే విధంగా ఏర్పాటు చేస్తాం. జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన ఆరు నెల‌ల్లోపు మూడు ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఆడ‌ప‌డుచుల కోసం కుటుంబ సంఖ్య ఆధారంగా రేష‌న్‌కి బ‌దులు నెల‌కి రూ. 2500- రూ. 3500 వారి ఖాతాల్లో జ‌మ చేసే ఏర్పాటు చేస్తాం. అన్ని కుటుంబాల‌కి ఏడాదికి ఆరు నుంచి ప‌ది గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా ఇస్తాం.

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రిగా మొద‌టి సంత‌కం 60 సంవ‌త్స‌రాలు నిండిన రైతుకి రూ. 5 వేల ఫించ‌న్ ఇచ్చే ప‌థ‌కం మీద పెడ‌తాం. రూ. 8 వేల సాగు సాయం అందిస్తాం. గుంత‌క‌ల్లుకి ప్ర‌త్యేక రైల్వేజోన్ సాధిస్తాం. రాయ‌ల‌సీమ‌కు మూడు ఐటీ కారిడార్స్ రావాలి. ప‌రిశ్ర‌మ‌లు రావాలి. ప‌రిశ్ర‌మ‌లు రావాలి అంటే స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు పారిశ్రామిక‌వేత్త‌ల్ని భ‌య‌పెట్ట‌డం మానాలి. పారిశ్రామికవేత్త‌ల్ని వాటాలు అడ‌గ‌డం మానాలి. జ‌న‌సేన ప్ర‌భుత్వంలో పారిశ్రామిక వేత్త‌ల‌కి బెదిరింపులు లేని ప‌రిస్థితులు క‌ల్పించ‌డంతో పాటు ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌రిచి యువ‌త వ‌ల‌స‌లు ఆపుతాం. 10వ త‌ర‌గ‌తి పాస‌య్యి ఖాళీగా ఉన్న యువ‌త కోసం 25 వేల ప్ర‌త్యేక పోలీస్ క‌మాండో పోస్టులు రూపొందిస్తున్నాం. లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిర‌క్ష‌ణ‌లోనూ, ట్రాఫిక్‌, రాత్రిళ్లు గ‌స్తీ త‌దిత‌ర అంశాల్లో వీరు పోలీసుల‌కి స‌హ‌కారాలు అందించే ఏర్పాటు చేస్తాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here