Home Uncategorized కాశి రివ్యూ..!

కాశి రివ్యూ..!

194
0

బిచ్చగాడు చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించి…తెలుగులో బాగా పాపులర్ అయిన హీరో విజ‌య్ ఆంటోని. ఆత‌ర్వాత విజ‌య్ ఆంటోని ఇంద్ర‌సేన‌, య‌మ‌న్, భేతాళుడు… త‌దిత‌ర చిత్రాల్లో న‌టించినా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేపోయాడు. దీంతో తాజాగా కాశి అనే టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో విజ‌య్ ఆంటోని స‌ర‌స‌న అంజ‌లి, సున‌య‌న‌ న‌టించారు. విజ‌య్ ఆంటోని భార్య ఫాటిమా విజ‌య్ ఆంటోని ఫిలిం కార్పోరేష‌న్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, త‌మిళ్ లో  కిరుతిగ ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కాశి చిత్రం ఈరోజు (మే 18న) రిలీజైంది. ఈసారి ఎలాగైనా స‌రే..విజ‌యం సాధించాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌మోష‌న్ లో భాగంగా ఈ సినిమాలోని తొలి ఏడు నిమిషాల సినిమాను ముందుగా సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసారు. మ‌రి…విజ‌య్ ఆంటోని ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా..?  కాశి కాసులు వర్షం కురిపిస్తుందా..?   లేదా..?  అనేది తెలుసుకోవాలంటే ముందుగా కాశి క‌థ చెప్పాలి.

క‌థ – భ‌ర‌త్ (విజ‌య్ ఆంటోని) అమెరికాలో ఫేమ‌స్ డాక్ట‌ర్. అయితే…భ‌ర‌త్ కి ఎప్పుడూ ఓ విచిత్ర‌మైన క‌ల వ‌స్తుంటుంది. దీంతో అన్నీ..ఉన్నా అత‌నిలో ఏదో వెలితి. ఎందుకు త‌న‌ను ఆ క‌ల వెంటాడుతుందో అర్ధం కాదు. ఇదిలా ఉంటే..ఓ రోజు త‌న త‌ల్లికి స‌డ‌న్ గా హెల్త్ ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది. టెస్ట్ లు చేస్తే..ఆమె రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయ‌ని తెలుస్తుంది. భ‌ర‌త్ త‌న కిడ్నీని త‌న త‌ల్లికి ఇస్తాన‌ని చెబుతాడు. అప్ప‌డు తండ్రి భ‌ర‌త్ తో నీ కిడ్నీ సూట్ అవ్వ‌దు. ఎందుకంటే..మేము నీ క‌న్న త‌ల్లిదండ్రులం కాద‌ని…విజ‌య‌వాడ‌లోని ఓ అనాధాశ్ర‌మం నుంచి తీసుకుని పెంచుకుంటున్నాం అని చెబుతారు. అంతే…షాకైన భ‌ర‌త్ త‌నకు వ‌చ్చే క‌ల‌కు… త‌న త‌ల్లిదండ్రులకు ఏదో సంబంధం ఉండి ఉంటుంద‌ని.. అదేంటో  తెలుసుకోవ‌డం కోసం అమెరికా నుంచి విజ‌య‌వాడ వ‌స్తాడు. ఇక అక్క‌డ నుంచి భ‌ర‌త్ ప్ర‌యాణం ప్రారంభం అవుతుంది. ఈ క్ర‌మంలో  భ‌ర‌త్ కాస్త కాశి ఎలా అయ్యాడు..?  ఎందుకు త‌న త‌ల్లిదండ్రులు త‌న‌ని అనాధ‌శ్ర‌మంలో ఇచ్చేయాల్సి వ‌చ్చింది..?  చివ‌రికి తల్లిదండ్రుల‌ను క‌లిసాడా..?  లేదా..?  అనేది మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

విజ‌య్ ఆంటోని పెర్ ఫార్మెన్స్, మ్యూజిక్

భాష్య‌శ్రీ డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్

క‌థ‌, క‌థ‌నం

విశ్లేష‌ణ – భ‌ర‌త్ కి త‌న త‌ల్లిదండ్రులు ఎవ‌ర‌ని తెలుసుకునే క్ర‌మంలో త‌ల్లి పేరు పార్వ‌తి అని తెలుసుకుంటాడు. ఇక అప్ప‌టి నుంచి తండ్రి ఎవ‌రు అని తెలుసుకోవాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలో డైరెక్ట‌ర్ కిరుతిగ ఉద‌య‌నిధి క‌థ‌ని ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల‌తో  ఇంట్ర‌స్టింగ్ చూపించే ప్ర‌య‌త్నం అయితే చేసాడు కానీ…అది స‌రైన రూట్ లో వెళ్ల‌క‌పోవ‌డం..అప్పుడ‌ప్పుడు ట్రాక్ త‌ప్ప‌డంతో ఆడియ‌న్స్ క‌నెక్ట్ కాలేక‌పోతున్నారు. సినిమా బిగినింగ్ నుంచి ఇందులో ఏదో విష‌యం అంద‌నిపిస్తుంది. అయితే…అస‌లైన ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్ లోకి వెళ్ల‌డం సినిమాకి మైన‌స్. త‌న తల్లి పార్వ‌తి ఊరు విజ‌య‌వాడ ద‌గ్గ‌ర కంచెర్ల‌పాలెం అని తెలుసుకుని అక్క‌డ‌కి వెళ‌తాడు. తండ్రి ఎవ‌రో తెలుసుకోవ‌డం కోసం ఆ గ్రామంలోకి కాశిగా ఎంట‌రై  హాస్ప‌ట‌ల్ స్టార్ట్ చేసి అంద‌రికీ ఉచితంగా వైద్యం చేస్తుంటాడు. ఊరులో ఉన్న వారింద‌రికీ హెల్త్ చెక‌ప్ పేరుతో టెస్ట్ లు చేసి…ఎవ‌రి డి.ఎన్.ఎ అయినా త‌న డి.ఎన్.ఎ తో మ్యాచ్ అవుతుందేమో అని టెస్ట్ చేస్తుంటాడు. కానీ..మ్యాచ్ కాదు.

ఆ ఊరు ప్రెసిడెంట్ త‌న తండ్రి ఏమో అనే అనుమానం వ‌స్తుంది. అత‌నికి పుట్టిన‌రోజు పేరుతో పార్టీ ఇచ్చి అస‌లు విష‌యం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. కానీ…ఇత‌ను కాద‌ని తెలుస్తుంది. ఇలా…ఎవ‌ర్నో చూసి అత‌ను త‌న తండ్రేమో అనుకోవ‌డం…వాళ్ల క‌థ‌ను భ‌ర‌త్ తో చూపించ‌డం జ‌రిగింది. ఇదంతా అస‌లు క‌థను వెంట‌నే చెప్పేస్తే బాగోదు కాబ‌ట్టి రెండున్న‌ర గంట‌లు ఆడియ‌న్స్ ని కూర్చొబెట్ట‌డం కోసం చెప్పిన‌ట్టు అనిపిస్తుంటుంది. ఫైన‌ల్ గా త‌న తండ్రి ఎవ‌రో  తెలుసుకుంటాడు. అయితే…ఆ విష‌యం మాత్రం భ‌ర‌త్ త‌న క‌న్న తండ్రికి చెప్ప‌డు. భ‌ర‌త్ త‌ల్లి  పార్వ‌తి ప్రేమించిన వ్య‌క్తిని వ‌ద‌లేసి వేరే ఊరు వెళ్లిపోతుంది. అలాగే భ‌ర‌త్ క‌న్న తండ్రి ఎవ‌రో తెలుసుకున్నా..చెప్ప‌కుండా వెళ్లిపోతాడు. ఎందుకు అనేది తెర పైనే చూడాలి.

భ‌ర‌త్ ప్ర‌యాణంలో అంజ‌లి, సున‌య‌న‌, అమ్రిత అయ్యార్, శిల్పా మంజునాథ్ అలా వ‌చ్చి వెళుతుంటారు. వీళ్లు పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. డాక్ట‌ర్ కాశికి కాంపౌడ‌ర్ గా న‌టించిన యోగి బాబు అప్పుడ‌ప్పుడు త‌న‌దైన స్టైల్ లో న‌టించి..ఆడియ‌న్స్ ని న‌వ్వించాడు.  టెక్నిక‌ల్ గా ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. విజ‌య్ ఆంటోని సన్నివేశానికి త‌గ్గ‌ట్టు అందించిన మ్యూజిక్ సినిమాకి ప్ల‌స్ పాయింట్. రిచ‌ర్డ్ ఎం నాథ‌న్ కెమెరా వ‌ర్క్ బాగుంది. అలాగే విజ‌య్ ఆంటోని ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. టోట‌ల్ గా కాశి గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…కాశి ఓకే.. కానీ..క‌ష్ట‌మే..!

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here