Home Movie News కేజీఎఫ్ నిజంగా అద్భుతం – రాజమౌళి

కేజీఎఫ్ నిజంగా అద్భుతం – రాజమౌళి

93
0

లెజెండరీ యాక్ట‌ర్ కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై విజయ్‌ కిరంగదూర్ నిర్మిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తుండగా.. కొత్త అమ్మాయి శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ నెల 21న ఐదు భాషల్లో భారీగా విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారాహి చలనచిత్రం’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్  హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లెజెండరీ యాక్ట‌ర్  కైకాల సత్యనారాయణతో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ…నాలుగైదు సంవత్సరాల క్రితం నేను సాయికొర్రపాటితో మాట్లాడుతూ.. కర్ణాటకలో సీన్ ఏంటండి? అక్కడ ఎవరు టాప్ అని అడిగితే.. ‘టాప్ స్టార్స్ కాకుండా ఒక కొత్త కుర్రాడు వచ్చాడు. అందరినీ దాటేసి ముందుకెళ్లిపోయాడు. హిట్ మీద హిట్  కొడుతున్నాడు. అత‌ని పేరు యష్’ అని చెప్పారు. ఎవరండీ ఈ యష్.. ఎప్పుడూ పేరు వినలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే.. ఒక బస్సు డ్రైవర్ కొడుకని చెప్పారు. అంతే కాకుండా ఇంకో విషయం చెప్పారు.. తన కొడుకు సూపర్‌స్టార్ అయినా కూడా ఆ తండ్రి ఇంకా బస్సు డ్రైవర్‌గానే పని చేస్తున్నారని. నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాదు నేనింత సంపాదించాను కదా.. నాకింత పేరు వచ్చింది కదా నువ్వు మానేయొచ్చు కదా అంటే.. ఒరేయ్ నేను బస్ డ్రైవర్ అయ్యే నిన్ను సూపర్‌స్టార్‌ను చేశా.. నీ పని నువ్వు చూసుకో.. నా పని నేను చేసుకుంటా అన్నారట. అప్పుడు నాకు అనిపించింది.. యష్ కంటే వాళ్ల నాన్నే పెద్ద సూపర్‌స్టార్ అని.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనో, మేలోనో నేను ఆర్ఆర్ఆర్ కథ చర్చల కోసం బెంగుళూరు వెళ్లాను. తాజ్ హోటల్‌లో ఉన్నప్పుడు యష్ కూడా అదే హోటల్‌లో ఉన్నాడు. వాళ్ల టీమ్ అంతా వచ్చి నన్ను కలిశారు. రెండు నిమిషాలు టైమ్ ఇస్తారా అని చెప్పి.. కేజీఎఫ్ వీడియో చూపించారు. ఫస్ట్ టైమ్ అప్పుడు నేను విజువల్స్ చూశా. నిజంగా అద్భుతంగా అనిపించింది. వాళ్ల ఎఫెర్ట్ అంతా విజువల్ క్వాలిటీలో కనిపించింది. చాలా ఫెంటాస్టిక్‌గా అనిపించింది. ఇది నిజంగా పాన్ ఇండియన్ సినిమా అవుతుందనిపించింది. బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా పాన్ ఇండియన్ సినిమా అయిపోదు. ఒక రీజియన్‌కు కట్టుబడకుండా.. అందరినీ అలరించే కథాంశం ఉంటే తప్పకుండా అది పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. కేజీఎఫ్ విజువల్స్ చూసినప్పుడు ఇది తప్పకుండా పాన్ ఇండియన్ సినిమా అవుతుందనిపించింది. వెంటనే బాంబేలోని అనిల్ తఢానీకి ఫోన్ చేసి.. కన్నడలో యష్ అనే హీరో చేసిన సినిమా విజువల్స్ చూశాను. చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి చూడండి అని చెప్పాను. తర్వాత శోభు గారికి(శోభు యార్లగడ్డ) చెప్పాను. సాయి గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. కేజీఎఫ్ కన్నడ సినిమాలాగా కాకుండా పాన్ ఇండియన్ సినిమాలా రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. అంత మంచి విజువల్స్ రావాలంటే డబ్బులు పెడితేనో, హీరో డేట్స్ ఇస్తేనో రావు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అలాంటి టీమ్ వీళ్లకు దొరికింది కాబట్టే ఇలాంటి సినిమా తీయగలిగారు. ఇండియాలో ఏ భాషలోనూ లేని గొప్పతనం మన తెలుగువాళ్లకు ఉంది. ఒక సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. కేజీఎఫ్ చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here