Home Actor చంద్ర‌బాబు కరప్షన్ ఆంధ్రగా మార్చేశారు – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

చంద్ర‌బాబు కరప్షన్ ఆంధ్రగా మార్చేశారు – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

74
0


వేల‌కోట్ల‌తో ముడిప‌డిన రాజ‌కీయాల‌ను సామాన్యుడి చెంత‌కు చేర్చ‌డానికి జ‌న‌సేన పార్టీ సామాన్యుల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింద‌ని  జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. ఒక కూలీ కొడుక్కి, ఒక బ‌స్ కండ‌క్ట‌ర్ కుమారుడికి, ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేని ఆడ‌బిడ్డ‌ల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. మిగ‌తా పార్టీల్లా త‌మ బంధువుల‌కు, త‌మ‌వారికి టికెట్లు ఇచ్చుకోలేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష‌ నేత జ‌గ‌న్మోహన్ రెడ్డి అంటే వ్య‌క్తిగ‌తంగా శ‌త్రుత్వం లేద‌ని, సామాన్యుడి బ‌తికే భార‌తం కావాల‌ని మాత్ర‌మే కోరుకుంటున్నాన‌ని వెల్ల‌డించారు. జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు.

 స‌భ‌కి హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ… “2006లో అన్న‌వ‌రం సినిమా షూటింగ్ లో ఉంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మేన‌మామ, క‌డ‌ప మేయ‌ర్ ర‌వీంద్ర‌నాథరెడ్డి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి సినిమా చేయాల‌ని ఇబ్బందిపెట్టారు. నాలాంటి వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌గ‌లిగితే ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌నిపించింది. ఇంత మంది అభిమానులు ఉన్న నాలాంటి వాడు కూడా రాజ‌కీయాల్లోకి రావ‌డానికి భ‌య‌ప‌డితే స‌మాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతాన‌ని చెప్పి 2008లో కామ‌న్ మ్యాన్ ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ పెట్టాను. దానిని ఎందుకు ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయాను అంటే.. మా అన్న ప్ర‌జారాజ్యం పార్టీ  పెట్టారు. ఆయ‌న మీద ఉన్న అపార‌మైన గౌర‌వం, మ‌ర్యాద‌తో వెన‌క్కి వెళ్లిపోయాను.

2014లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేవాడిని కాదు. కానీ ప్ర‌ధాని మంత్రి అభ్య‌ర్ధి మోడీ గారు చంద్ర‌బాబుతో క‌లిసి వెళ్తున్నాం, మీరు కూడా వ‌స్తే బాగుంటుంది అని అడ‌గ‌బ‌ట్టి ఆనాడు తెలుగు దేశానికి మ‌ద్ద‌తు ఇచ్చాను. అప్పుడు ప్ర‌చారంలో భాగంగా మోడీ గారు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స్కాం ఆంధ్రాగా మారుతుంద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌డు అలాంటి వ్య‌క్తుల‌తో ఎలా క‌లుస్తారు. నేను కూడా ఆనాడు స్కాం ఆంధ్ర వ‌ద్ద‌ని చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తే ఈయ‌న క‌రెప్ష‌న్ ఆంధ్ర తీసుకొచ్చారు. దొరికిన‌కాడికి ఇసుక‌ను దోచేసి జేబులు నింపుకున్నారు. ఇవ‌న్ని చూసి విసిగి   పోయి ఇవాళ ఒంట‌రిగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఒంట‌రిగా పోటీ చేయ‌డం మ‌న ఉనికిని చాటుకోవ‌డం కోసం. గెలుపోట‌ములను కాలం నిర్ణ‌యిస్తుంది. మార్పు రావాల‌ని చిత్త‌శుద్దితో కోరుకుంటే కాల‌మే గెలుపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కావాలో వ‌ద్దో, జ‌న‌సేన ప్ర‌భుత్వం రావాలో లేదా అనేది మ‌రో 40 రోజుల్లో తేలుతుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here