Home Actor డియ‌ర్ కామ్రేడ్ రివ్యూ..!

డియ‌ర్ కామ్రేడ్ రివ్యూ..!

250
0
డియ‌ర్ కామ్రేడ్ రివ్యూ..! spiceandhra

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం… ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో యూత్ ని ఆక‌ట్టుకున్న‌ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్. ఈ చిత్రం ద్వారా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యారు. గీత గోవిందం జంట విజ‌య్ – ర‌ష్మిక ఈ సినిమాలో కూడా జంట‌గా న‌టించ‌డంతో ఈ సినిమా పై భారీ స్ధాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ రోజు (జులై 26)న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. విజ‌య్ – ర‌ష్మిక మ‌రోసారి ఆక‌ట్టుకున్నారా..?  డియ‌ర్ కామ్రేడ్ ఆశించిన విజ‌యం సాధించాడా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – కాకినాడ‌లో ఉండే చైత‌న్య అలియాస్ బాబీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) స్టూడెంట్ లీడ‌ర్. త‌న క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే.. చూస్తూ ఊరుకోలేడు. ఫైట్ చేస్తాడు. ఇలా.. ఎప్పుడూ ఏదొక గొడ‌వ‌ల్లో ఉంటుంటాడు. అప‌ర్ణ దేవి అలియాస్ లిల్లీ (ర‌ష్మిక‌) స్టేట్ లెవ‌ల్ క్రికెట్ ప్లేయ‌ర్. త‌న‌కు నేష‌న‌ల్ లెవ‌ల్ క్రికెట్ ప్లేయ‌ర్ అవ్వాల‌న్న‌ది డ్రీమ్. ఆమె త‌న క‌జిన్ పెళ్లి కోసం కాకినాడ వ‌స్తుంది. బాబీ ఇంటికి ఎదురుగానే లిల్లీ క‌జిన్ ఉంటారు. లిల్లీ కాకినాడలో బ‌స్ దిగిన వెంట‌నే బాబీ ప‌రిచ‌యం అవుతాడు. ఆత‌ర్వాత ఆ ప‌రిచ‌యం కాస్త స్నేహంగా మారుతుంది. నిన్ను  ప్రేమిస్తున్నాను అని బాబీ లిల్లీకి చెబుతాడు కానీ.. లిల్లీ ఇదంతా ఆక‌ర్ష‌ణ అని చెబుతుంది.

పెళ్లి త‌ర్వాత హైద‌రాబాద్ వెళ్లిపోతుంది కానీ.. బాబీ మాత్రం లిల్లీ జ్ఞాప‌కాల‌తో ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తుంటాడు. ఒక రోజు కాకినాడ నుంచి హైద‌రాబాద్ బైక్ పైనే వెళ్లి లిల్లీని క‌లుస్తాడు. అక్క‌డ లిల్లీ ప‌రిస్ధితి కూడా అలాగే ఉంటుంది. ఇద్ద‌రం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కానీ.. ఆత‌ర్వాత అనుకోని సంఘ‌ట‌న వ‌ల‌న లిల్లీ బాబీని వ‌దిలేసి వెళ్లిపోతుంది. దీంతో బాబీ పిచ్చోడైపోతాడు. కొత్త ప్ర‌దేశాలు, కొత్త వ్య‌క్తుల‌ను క‌లుసుకుంటూ దేశం మొత్తం తిరుగుతాడు. ఆత‌ర్వాత అనుకోకుండా లిల్లీ హాస్ప‌ట‌ల్ లో ఉంద‌ని తెలుస్తుంది. ఎందుకు లిల్లీ హాస్ప‌ట‌ల్ లో ఉంది..? ఆమెకు వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి..? ఆ స‌మ‌స్య పై పోరాడేందుకు బాబీ ఏం చేసాడు..?  అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ – విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక వైపు స్టూడెంట్ లీడ‌ర్ గా.. మ‌రో వైపు ప్రేమికుడుగా.. రొమాన్స్, యాక్ష‌న్, సెంటిమెంట్.. ఇలా పాత్ర స్వ‌భావానికి త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించాడు. ఇక ర‌ష్మిక అయితే.. గొడ‌వ‌లు లేకుండా హాయిగా జీవించాల‌నుకునే అమ్మాయిగా, క్రికెట్ ప్లేయ‌ర్ గా చాలా చ‌క్క‌గా న‌టించింది. వీరిద్ద‌రి పై చిత్రీక‌రించిన ల‌వ్ సీన్స్ యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యేలా.. ఎంజాయ్ చేసేలా డైరెక్ట‌ర్ భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించారు. అయితే.. ల‌వ్ సీన్స్ మిన‌హా ఫ‌స్టాఫ్ స్లోగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.

ఇక సెకండాఫ్ కి వ‌చ్చేస‌రికి క‌థ అంతా సెకండాఫ్ లోనే చెప్పే ప్ర‌య‌త్నం చేసాడ‌నిపిస్తుంది. ట్విస్ట్ లుతో ఆడియ‌న్స్ ఇంట్ర‌స్టింగ్ గా చూసేలా చేయాల‌నే ప్ర‌య‌త్నంలో క‌థ‌నం కాస్త భారంగా ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది. అయితే.. ఈ సినిమాలో చ‌ర్చించిన పాయింట్ మంచిదే అయినా.. ఈ క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు అని చెప్ప‌చ్చు. సెకండాఫ్ లో హీరో టూర్ తిరుగుతుంటాడు. విజువ‌ల్ గా బాగున్నా..కొత్త‌ద‌నం మాత్రం క‌నిపించ‌దు. 

కొన్ని సీన్స్ చూస్తుంటే… క్లైమాక్స్ ఎప్పుడు వ‌స్తుందా..? అని ఎదురు చూసేలా ఉంది. ప్ర‌భాక‌రన్ సంగీతం, సుజిత్ సినిమాటోగ్ర‌ఫీ బాగున్నాయి. మైత్రీ మూవీస్, బిగ్ బెన్ సినిమాస్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీ ఈ సినిమాని నిర్మించారు. ద‌ర్శ‌కుడు మంచి పాయింట్ చెప్పాల‌నుకున్నా.. అంద‌రూ మెచ్చేలా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ఫెయిల్ అయ్యాడ‌నిపిస్తుంది.

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here