Home Movie News నంద‌మూరి అభిమానుల‌కు నిజ‌మైన ద‌స‌రా..!

నంద‌మూరి అభిమానుల‌కు నిజ‌మైన ద‌స‌రా..!

150
0

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ చిత్రం అర‌వింద స‌మేత‌..వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ భారీ స‌క్స‌స్ మీట్ ఏర్పాటు చేసింది. హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌రిగిన ఈ వేడుక‌కు నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ముఖ్య అతిధిగా హాజ‌రు కావ‌డం విశేషం.

నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో బాల‌య్య –  జూనీయ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఓకే వేదిక మీద ఉంటే చూడాల‌నుకున్నారు. ఆ..అపూర్వ క‌ల‌యిక‌కు  అర‌వింత స‌మేత స‌క్స‌స్ మీట్ వేదిక అయ్యింది. బాల‌య్య‌, ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్…ఈ ముగ్గురిని ఒకే వేదిక మీద చూడ‌డంతో నంద‌మూరి అభిమానుల‌కు నిజ‌మైన ద‌స‌రా పండ‌గ ఇదే అని చెప్ప‌చ్చు..! ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ… జూనియర్‌ ఎన్టీఆర్‌, తివిక్రమ్‌తోపాటు నటీనటులకు, పంపిణీదారులకు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలను అందించారు.

ఈ వేడుక‌లో బాల‌కృష్ణ మాట్లాడుతూ…నేను, జూనీయ‌ర్ ఎన్టీఆర్ చేసే సినిమాలు చేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఇత‌రుల‌కు అవి అసాధ్యం. మేం ఎంచ‌కునే క‌థ‌లు లార్జ‌ర్ దెన్ లైఫ్ అన్న‌ట్టు ఉంటాయి. భూత‌ద్దం పెట్టి చూస్తేనే వాటి లోతు తెలుస్తుంది. మా సినిమాల్లో అన్ని ర‌సాలు ఉండాల‌నుకుంటాం. మా అభిమానులు కూడా అలాగే కోరుకుంటారు. తెలుగు అనే మూడ‌క్ష‌రాలు వింటే నా ర‌క్తం ఉప్పొంగుతుంది. ఎన్టీఆర్ అనే మూడ‌క్ష‌రాలు వింటే నా త‌నువు పుల‌క‌రిస్తుంది. చారిత్రాత్మక, పౌరాణిక చిత్రాలు చెయ్యడానికి నందమూరి వంశం పెట్టింది పేరు.

యన్‌.టి.ఆర్‌ బయోపిక్‌తో బిజీగా ఉండి ఈ సినిమా చూడలేకపోయాను. ట్రైలర్లు చూశా. పాలిచ్చి పెంచినవారు.. పాలించలేరా?’ అనే డైలాగ్‌ బాగా నచ్చింది. వెంటనే లెజెండ్‌లో మహిళల గురించి నేను చెప్పిన డైలాగులు గుర్తొచ్చాయి. త్రివిక్రమ్‌ మాటల్లో చురుకుదనం, పదును ఉంటాయి. దర్శకత్వం వహించడంలో త్రివిక్రమ్‌ శైలి వేరు. తెలుగు ఇండస్ట్రీ గర్వించే దర్శకుడాయన. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నా. ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. ఎక్కడైనా పోటీ ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉండాలే తప్ప ఇతరులను బాధ కలిగించేలా ఉండకూడదు.

వినోదాన్ని పంచడమే కాకుండా ఆలోచన రేకెత్తించే సినిమాలు రావాలి. ఏవో సినిమాలొచ్చాయి.. పోయాయి అనే విమర్శలు రాకుండా పట్టుదలతో మంచి సినిమాలు చెయ్యాలి. భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు రావాలన్నది దర్శకనిర్మాతలు ఆలోచించాలి. అభిమానులతో మాకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జన్మజన్మల బంధం అది. మా అభిమానులు క్రమశిక్షణగా ఉండాలని ఎప్పుడూ చెబుతుంటా. కానీ అభిమానం, ఆత్మాభిమానంతో కూడి ఉండకూడదని మరీమరీ చెబుతున్నా. అభిమానం వేరు… ఆత్మాభిమానం వేరు అని అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ…మా ప్ర‌య‌త్నానికి మీ ఆశీర్వాదం అందించిన మీ ప్రేమ‌ను ఎల్ల‌ప్పుడు మా పై కురిపిస్తూ ఈ చిత్రాన్ని విజ‌య‌ప‌థం వైపు న‌డిపించిన‌టువంటి అభిమాన సోద‌ర‌లంద‌రికీ వంద‌నాలు.  ఎంతో శ్ర‌ద్ద‌తో.. ఎంతో జాగ్ర‌త్త‌తో కొత్త ప్ర‌య‌త్నానికి నాంది ప‌లికిన నా ఆప్త‌మిత్రుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కి  రెట్టింపు ఉత్సాహం ఇచ్చినందుకు ప్రేక్ష‌కులంద‌రికీ శిర‌స్సు వంచి పాదాభివంద‌నం చేసుకుంటున్నాను. జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాన్ని అందించినందుకు త్రివిక్ర‌మ్ గారికి మ‌రోసారి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.

నల్ల మబ్బులు కమ్ముకున్నట్లు విషాదఛాయాల్లో ఉన్న మా కుటుంబంలోకి  ఈ సినిమా సక్సెస్‌తో కొత్త వెలుగు తీసుకొచ్చారాయన. మా ఇద్దరి కలని తమ భుజాల పై వేసుకుని మోసిన ప్రతి టెక్నీషియన్‌నూ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ఆనందాన్ని అభిమానులతోనే కాకుండా మా బాబాయ్‌తో కూడా పంచుకుందామని ఆయన్ను అతిథిగా ఆహ్వానించాం. మా నాన్న కూడా ఉండుంటే చాలా బావుండేది. ఆయన ఇక్కడే ఉండి మా ఆనందాన్ని తిలకిస్తుంటారు. ఆయన లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడికి వచ్చిన బాబాయ్‌కి  పాదాభివంద‌నం చేస్తున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here