Home News పవన్‌ కల్యాణ్ ముఖ్య‌మంత్రి కానున్నారు – బిఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తి.

పవన్‌ కల్యాణ్ ముఖ్య‌మంత్రి కానున్నారు – బిఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తి.

88
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారని, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌న‌సేన‌, బిఎస్పీ, సిపిఐ, సిపిఎంలతో కూడిన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, శ్రీ పవన్‌ కల్యాణ్ ముఖ్య‌మంత్రి కానున్నారని బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావ‌తి గారు స్పష్టం చేశారు. లోక్ స‌భ‌, శాస‌న‌స‌భ రెండింట్లోనూ ఈ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌ని వెల్ల‌డించారు. విశాఖలోని సాయిప్రియ రిసార్ట్స్ లో బిఎస్పీ అధినేత్రి మాయావతి, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంయుక్తంగా మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాయ‌వ‌తి గారు మాట్లాడుతూ.. “ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చాలా కాలం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తగిన న్యాయం జరగలేదు. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్త‌వం. ఏపీకిచ్చిన హామీలను ప్ర‌ధాని మోదీ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్‌, బీజేపీల పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో దళితులు, వెనకబడిన వర్గాలవారు ఎక్కువగా ఉన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్‌ వలలో పడవద్దు. ఏపీ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలి. ఇప్పుడున్న రాజకీయ పక్షాలలో శ్రీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మంచి ప్రత్యామ్నాయం.  పవన్ క‌ళ్యాణ్ గారి వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో పాటు బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయి. మా కూటమికి సంపూర్ణ మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం. మా కూటమికి సంపూర్ణ మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం” అన్నారు.

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ..  “భార‌తీయ జ‌నతా పార్టీ , కాంగ్రెస్ పార్టీల తర్వాత ఏకైక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీయే.  బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి గారి మార్గనిర్దేశం కోరుకుంటున్నాం. మాట ఇస్తే నిల‌బ‌డే త‌త్వం, పాల‌న అనుభ‌వ‌మే ఆమె వెంట న‌డిచేలా చేసింది. బీఎస్పీతో కలిసి పని చేయాలని 2008 నుంచి  ఆహ్వానాలు అందాయి. అయితే అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కలిసి ముందుకు వెళ్లలేకపోయాము. అయితే బీఎస్పీ మేధావులు, దళిత నేతలతో నా సాన్నిహిత్యం ఇప్ప‌టికీ కొనసాగుతుంది. 2014లో అప్పటి పరిస్థితులను అనుసరించి బీజేపీ, టీడీపీలతో కలిసి పని చేశాం. సన్నిహితులు, మేధావులు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు బీఎస్పీతో కలవాలని కోరారు. 

వాళ్ల సూచ‌న మేర‌కు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికల్లో బీఎస్పీతో క‌లిసి పోటీ చేస్తున్నాం. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. ఏ కార‌ణాల‌తో ఆ హామీ నెర‌వేర్చ‌లేక‌పోయారో కేసీఆర్ గారే చెప్పాలి.  దళితుడిని సీఎం చేయకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉంది. ఈ దేశానికి బెహన్ జీ మాయావ‌తి గారిని ప్రధానిగా చూడాల‌న్న‌ది నా ఆకాంక్ష. దేశానికి ఓ చాయ్ వాలా, చౌకీదార్ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ఓ పోరాటయోధురాలు ప్రధాని కాబోతున్నారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను  ఎదుర్కొని ఆమె ఈ స్థాయికి చేరారని.. ఆమె సూచనలు, సలహాలు కోరుకుంటున్నాం అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here