Home Actor ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయిన వ్యక్తి సిఎం అయి ఏం చేస్తాడు? – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయిన వ్యక్తి సిఎం అయి ఏం చేస్తాడు? – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

71
0


వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి, ప్ర‌కాశం జిల్లా నుంచి వ‌ల‌స‌లు నివారించ‌గ‌లిగితే జ‌న్మ ధ‌న్యమైన‌ట్లేన‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు  ప‌వ‌న్ క‌ళ్యాణ్  పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహన్ రెడ్డి గారు ఎంత‌సేపు రోడ్ల మీదే తిరుగుతారుగానీ, అసెంబ్లీకి వెళ్లి వెలుగొండ ప్రాజెక్టుపై అధికార ప‌క్షాన్ని నిల‌దీయ‌రని ఎద్దేవా చేశారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకుండా స‌మ‌స్య‌ల పై పోరాటం చేసి ప్ర‌భుత్వం మెడ‌లు వంచి  ప‌ని చేసేలా చేశామ‌ని, అధికారంలోకి వ‌స్తే కేవ‌లం 18 నెల‌ల్లోనే వెలుగొండ‌ను పూర్తి చేసి ప్ర‌కాశం జిల్లా క‌రవును పార‌దోలుతామ‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాగంగా  ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న  ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్కాపురం, ద‌ర్శి నియోజ‌వ‌ర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు.

ఈ వేదిక‌లు నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ..  “ప్ర‌కాశం జిల్లాలో 34 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఉంటే.. దాదాపు 8 ల‌క్ష‌ల మంది వ‌ల‌స వెళ్లిపోయారు. వ‌ల‌స‌లు నివారించే క‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక జ‌న‌సేన అమలు చేస్తుంది. ఉద్ధానం ప్రాంతంలాగే ప్ర‌కాశం జిల్లాలో చాలా ప్రాంతాల్లో కిడ్నీ స‌మ‌స్య‌లు ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్నాయి. క‌నీసం డ‌యాల‌సీస్ సెంట‌ర్లు కూడా లేవు. కిడ్నీ స‌మ‌స్య‌లు లేని ప్ర‌కాశం జిల్లాను జ‌న‌సేన చూడ‌ల‌నుకుంటుంది. అంత‌కు ముందు కిడ్నీ వ్యాధిని నయం చేయ‌డానికి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల్లో అవ‌స‌ర‌మైన‌ డ‌యాల‌సిస్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తాం. దొన‌కొండను  పారిశ్రామిక న‌గ‌రం పేరు చెప్పి వేల ఎక‌రాలు రైతుల నుంచి తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప‌రిశ్ర‌మ కూడా నెల‌కొల్ప‌లేదు.

ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల్సిన నాయ‌కులు కంపెనీల్లో వాటాలు అడుగుతుంటే పారిశ్రామిక వేత్త‌లు పారిపోతున్నారు. నీతి, నిజాయతీగ‌ల ప్ర‌భుత్వాన్ని జ‌న‌సేన పార్టీ స్థాపిస్తుంది.  ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించి 5 వేల మందికి ఉపాధి క‌ల్పిస్తాం. ద‌ర్శిలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచే ఉంది. ఒక్క ద‌ర్శిలోనే కాదు ప్ర‌తి మండ‌లంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం.  2016లో రూ. 25 కోట్ల‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్‌ శిక్షణ, రీసెర్చ్‌ కేంద్రానికి శంకుస్థాప‌న చేశారు. మూడేళ్లు గ‌డుస్తున్న శంకుస్థాప‌న చేసిన ప్రాంతంలో శిలాఫ‌ల‌కం త‌ప్ప క‌నీసం సైకిల్ కూడా ఎవ‌రూ నేర్చుకోవ‌డం లేదు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికీ తాగు, సాగు నీటి కోసం దేహీ అని అడుక్కోవాల్సిన ప‌రిస్థితి. ఈ స‌మ‌స్య‌ల పై అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సిన ప్ర‌తిప‌క్ష‌నేత ఫెయిల్ అయ్యారు. ప్ర‌తిప‌క్ష‌నేత గానే విఫ‌ల‌మైన వ్య‌క్తి ముఖ్య‌మంత్రి అయి ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తారు అని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here