బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 సక్సస్ ఫుల్ గా రన్ అయ్యాయి. కోట్లాది మందిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 21 నుంచి ఈ షోను ప్రారంభించనున్నారు. అయితే… ఊహించని విధంగా ఈ షో ప్రారంభం కాకుండానే అవాంతరాలు ఏర్పడుతున్నాయి. బిగ్ బాస్ షో నిర్వాహకుల పై యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రియాల్టీ షోపై మరో పిటిషన్ దాఖలైంది.
ఇంతకీ ఈ పిటిషన్ ఏంటంటే… ఈ షోలో అభ్యంతరకర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే సినిమాలాగే ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేసి ప్రసారం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతే కాకుండా రాత్రి 11 గంటల తర్వాతే బిగ్‌బాస్ 3 షో ప్రసారం చేయాలంటూ పిటిషినర్ కోరినట్లుగా తెలిసింది. బిగ్‌బాస్ షో కోఆర్డీనేషన్ టీం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ షోపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బిగ్‌బాస్ 3 పై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్లతో నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొంది. కాగా బిగ్‌బాస్ టీం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించద్దు అంటూ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైకోర్టు వద్ద నిరసనకు దిగారు. మరి.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.