Home Telugu మ‌హాన‌టికి మ‌హామ‌హుల నీరాజ‌నాలు

మ‌హాన‌టికి మ‌హామ‌హుల నీరాజ‌నాలు

196
0

అల‌నాటి న‌టి సావిత్రి జీవితక‌థ‌తో రూపొందిన మ‌హాన‌టి చిత్రం క్లాసు, మాసు అనే తేడా లేకుండా ఆల్ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. సావిత్రి సినిమా కోసం పుడితే…సావిత్రి పాత్ర పోషించ‌డం కోస‌మే..కీర్తి సురేష్ పుట్టిందా అనేంత‌ అద్భుతంగా న‌టించి మెప్పించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ దిశ‌గా ప‌రుగులు తీస్తుంది. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని చిత్రంగా నిలిచిన మ‌హాన‌టి సినిమా గురించి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు స్పందిస్తూ…ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

రాఘ‌వేంద్ర‌రావు
ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మ‌హాన‌టి సినిమా గురించి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ….28 ఏళ్ళ క్రితం ఇదే రోజున (మే 9) జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సినిమా రిలీజైంది. ఓ వైపు భారీ వర్షం… మ‌రో వైపు చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు…ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు… మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది.

మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. అదే రోజు న నేడు (మే9) మహానటి విడుదలయింది. ఆరోజున జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి. సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . కీర్తి సురేష్ సావిత్రి పాత్ర లో జీవించింది. జెమినీ గణేశన్ గా దుల్క‌ర్ స‌ల్మాన్ నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు అని తెలియ‌చేసారు.

నాగార్జున‌
టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌హాన‌టిలో చైత‌న్య త‌న తండ్రి పాత్ర పోషించ‌డం గురించి ట్వీట్ చేస్తూ…తండ్రిగా గ‌ర్వ‌ప‌డుతున్నా…కొడుకుగా అసూయ‌ప‌డుతున్నా. నా తండ్రి లెజండ‌రీ ఎ.ఎన్.ఆర్ గారి పాత్ర‌లో నేను ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు. కానీ..మ‌హాన‌టి చిత్రంలో చైత‌న్య‌ను ఎ.ఎన్.ఆర్ పాత్ర‌లో చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చైత‌న్య అక్కినేనిగా క‌నిపించిన వీడియోను పోస్ట్ చేసారు.

ఈ వీడియోలో….రామాపురం అనే చిన్న ప‌ల్లెటూరు. పేద రైతు కుటుంబం. ఆర్ధిక ఇబ్బందుల వ‌ల్ల చ‌దువుకోలేక వ్య‌వ‌సాయం చేసుకుంటూ..న‌ట‌న మీద వ్యామోహంతో నాట‌కాల్లో స్త్రీ పాత్ర‌లు వేస్తున్న 17 ఏళ్ల కుర్రాడు ఘంట‌సాల బ‌ల‌రామ‌య్య అనే నిర్మాత దృష్టిలో ప‌డి ధ‌ర్మ‌ప‌త్ని అనే సినిమాలో త‌ళుక్కున మెరిసాడు. ఆయ‌నే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హీత, ప‌ద్మ‌భూష‌ణ్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు. ఎ.ఎన్.ఆర్ గారి స‌ర‌స‌న ఎంతో మంది న‌టించినా…ఎ.ఎన్.ఆర్ – సావిత్రి జంట‌గా చేసిన చిత్రాల‌న్నీ చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి. కాసుల వ‌ర్షాన్ని కురిపించాయి. మాయాబ‌జార్, దేవ‌దాసు, మూగ మ‌న‌సులు, సుమంగ‌ళి, డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి, ఆరాధ‌న‌, న‌వ‌రాత్రి వంటి చిత్రాలు తెలుగు సినిమా కిరీటంలో వ‌జ్రాలుగా పొద‌గ‌బ‌డ్డాయి.ఈనాటి మ‌హాన‌టి చిత్రంలో ఆనాటి అక్కినేనిగా న‌టించిన ఆ..అక్కినేని వార‌సుడు, మ‌న‌వ‌డు నాగ‌చైత‌న్య అంటూ నాని వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. ఈ సినిమా గురించి మ‌రోసారి నాగార్జున స్పందిస్తూ…కీర్తి సురేష్‌, దుల్క‌ర్ స‌ల్మాన్ అద్భుతంగా న‌టించారు. నాగ్ అశ్విన్, వైజ‌యంతి మూవీస్ తెలుగు సినిమా స్ధాయిని మ‌రో స్ధాయికి తీసుకెళ్లారు. స‌మంత‌..నీ న‌ట‌న చూసి గ‌ర్వంతో కంట‌త‌డి పెట్టుకున్నాను. ఈ సినిమా సావిత్ర‌మ్మ‌కు గొప్ప నివాళి అన్నారు.


జ‌గ‌ప‌తిబాబు బ్ర‌ద‌ర్ రామ్ ప్ర‌సాద్
సావిత్రి సినిమా చూసి జ‌గ‌ప‌తిబాబు బ్ర‌ద‌ర్ రామ్ ప్ర‌సాద్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…సావిత్రి సినిమా చాలా బాగుంది. ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ తీస్తే…అక్కినేని యంగ్ గెట‌ప్ లో చైత‌న్య న‌టించ‌వ‌చ్చు. ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ లో న‌టించేందుకు రెడీ అవ్వు చైతు అంటూ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు.


రాజ‌మౌళి
తెలుగు సినిమా స‌త్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమాతో దేశ‌, విదేశాల్లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న రాజ‌మౌళి సావిత్రి సినిమా చూసి త‌న స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంత‌కీ జ‌క్క‌న్న ఏమ‌న్నారంటే.. మ‌హాన‌టి చిత్రాన్ని అద్భుతంగా తీశారంటూ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలను అభినందించారు. ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా న‌టించింది. తాను చూసిన అత్యద్భుతమైన‌ పర్ఫామెన్స్ లలో కీర్తి సురేష్ ది ఒకటని చెప్పారు. మహానటికి ఆమె మళ్లీ జీవం పోశారని కితాబిచ్చారు. ఇక దుల్కర్ సల్మాన్ గురించి చెబుతూ…దుల్క‌ర్ నటన అద్భుతంగా ఉంది. అతనికి ఇప్పుడు ఫ్యాన్ గా మారిపోయానని ట్వీట్ చేశారు.


సుకుమార్
ఇటీవ‌లే రంగ‌స్థ‌లం సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకున్న సుకుమార్..మ‌హాన‌టి సినిమా చూసి త‌న స్పంద‌నను ఓ లేఖ రూపంలో తెలియ‌చేసారు. ఈ లేఖ‌లో సుక్కు…ప్రియ‌మైన అశ్విన్..మ‌హాన‌టి సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చి, నీతో మాట్లాడ‌దామ‌ని నీ నెంబ‌ర్ కి ట్రై చేస్తున్నాను. ఈలోగా ఓ ఆవిడ వ‌చ్చి నువ్వు డైరెక్ట‌రా బాబు అని అడిగింది. అవున‌న్నాను..అంతే..న‌న్ను గ‌ట్టిగా ప‌ట్టుకుని ఏడ్చేసింది. ఎంత బాగా చూపించావో బాబు..మా సావిత్ర‌మ్మ‌ని అంటూ…నా క‌ళ్ల‌ల్లో నీళ్లు..నేను నువ్వు కాద‌ని చెప్ప‌లేక‌పోయాను. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను. మ‌న‌సారా..ఆవిడ న‌న్ను దీవించి వెళ్లిపోయింది.కొన్ని క్ష‌ణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో..ఇంత‌క‌న్నా ఏం చెప్తాను. నా అనుభూతి ఈ సినిమా గురించి..! ఆవిడ‌కి ఎప్ప‌టికీ నేను నువ్వు కాద‌ని తెలియ‌క‌పోతే బావుండు అంటూ త‌న స్పంద‌న‌ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

తెలంగాణ రాష్ట్ర మంతి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌హాన‌టి సినిమా చూసి ట్విట్ట‌ర్ లో త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చారు. సావిత్రి సినిమా అద్భుతంగా ఉంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని కొనియాడారు. ఇంత మంచి చిత్రాన్ని అందించినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యలు అద్భుతంగా నటించారని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


వీళ్లతో పాటు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, మోహ‌న్ లాల్, డైరెక్ట‌ర్ క్రిష్, మురుగుదాస్, నాని, కాజ‌ల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్..త‌దిత‌రులు మ‌హాన‌టి సినిమా అద్భుతం అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here