Home Actor యువ త‌రం మార్పు కోరుకుంటుంది – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

యువ త‌రం మార్పు కోరుకుంటుంది – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

102
0


ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్ట‌కూడ‌ద‌ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గాజువాక‌, భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో రూ. 100 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాయి. వాళ్లు ఎన్ని వంద‌ల కోట్లు కుమ్మ‌రించినా నేను అసెంబ్లీలో అడుగుపెట్టి, అవినీతిప‌రుల తాట‌తీయటం  ఖాయ‌మ‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు  ప‌వ‌న్ క‌ళ్యాణ్ సవాల్ చేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొత్త త‌రం రాబోతుందని, మార్పు త‌థ్య‌మ‌ని అన్నారు.  జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లా య‌ల‌మంచిలిలో బ‌హిరంగ‌స‌భ ఏర్పాటు చేశారు.

స‌భ‌కి హాజ‌రైన జ‌న‌సైనికులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప‌వ‌న్‌క‌ళ్యాణ్  మాట్లాడుతూ… “జ‌న‌సేన పోరాట‌యాత్ర స‌మ‌యంలో య‌ల‌మంచిలి ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు చూశాను.  అచ్యుతాపురం సెజ్ వ‌ల్ల 10వేల కుటుంబాలు నిర్వాసితుల‌య్యారు. ఉద్యోగం, పాడి గేదె ఇస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది 12 ఏళ్లు అవుతున్న ఇప్ప‌టికీ హామీలు అమలు చేయలేదు. అలాగే ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం లేదు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చివ‌రి మూడు నెల‌లు నిరుద్యోగ భృతి అని రూ. 2,500 ముఖాన కొడితే వాళ్లే ఓటు వేస్తారు. మ‌ర‌ల ఐదేళ్లు దోచుకోవ‌చ్చ‌ని అనుకుంటున్నారు. జ‌న‌సేన మాత్ర‌మే యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంది.

* పరిశ్రమల్లో స్థానికులకే పెద్దపీట వేయిస్తాం

సెజ్ లు ఆర్ధిక ప్ర‌గ‌తికి ఉప‌యోగ‌ప‌డాలి. మ‌న భూములు తీసుకుని ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పి స్థానికుల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌క‌పోతే అశాంతి చెల‌రేగి ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితి వ‌స్తుంది. కుల, ప్రాంతీయ ఘర్షణలు చెల‌రేగుతాయి. తెలంగాణ‌లో కూడా ఇలానే చేస్తే మ‌న‌ల్ని త‌రిమేశారు. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి రాగానే.. ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానిక‌త‌కు పెద్ద‌పీట వేస్తుంది. నిరుద్యోగ యువ‌త‌కు సెజ్ లలో  ప‌రిశ్ర‌మలు పెట్ట‌క‌ముందే నైపుణ్యాలు అభివృద్ధి చేసి, ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాలు క‌ల్పిస్తాం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గారు బీచ్ ఫెస్టివ‌ల్ పేరుతో వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తారు. విజ‌య డెయిరీని చంపేసిన‌ట్లు విశాఖ డెయిరీని కూడా చంపేయాల‌ని చూస్తున్నారు.

దాని ఆస్తులు ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా ఉన్న ఉద్యోగాలుపోతే యువ‌త‌లో అశాంతి ర‌గిలి విపత్తుకు దారి తీస్తుంది. యువ‌త‌రం మార్పు కోరుకుంటుంది. అందుకే వేలాది మంది రోడ్ల‌పైకి వ‌చ్చి జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లో మాదిరి య‌ల‌మంచిలిలో కూడా 60:40 ప‌ర్సంటేజ్ న‌డుస్తుంది. అధికార, ప్ర‌తిప‌క్ష నేత‌లు కుమ్మ‌క్కై వాటాలు పంచుకుంటున్నారు. కాంట్రాక్టులు, క్వారీల్లో అధికార పార్టీకి చెందిన నాయ‌కులు 60 శాతం, ప్ర‌తిప‌క్షానికి చెందిన నాయ‌కులు 40 శాతం వాటాలు తీసుకుంటున్నారు. జ‌న‌సేన పార్టీ లేక‌పోతే ఈ దోపిడి నిరంతరం కొన‌సాగుతునే ఉంటుంది.

స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు రాజ‌కీయాల‌ను వ్య‌క్తిగ‌తంగా ఎద‌గ‌టానికి ఉప‌యోగించుకున్నారు త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు ఒక్క‌టి కూడా చేయ‌లేదు. నిల‌దీయాల్సిన ప్ర‌తిప‌క్ష‌ నేత దీనిపై మాట్లాడ‌రు. తిత్లీ తుపాన్ వ‌చ్చి శ్రీకాకుళం ప్ర‌జ‌లు న‌లిగిపోతే .. విజ‌య‌న‌గ‌రంలో తాపీగా పాద‌యాత్ర చేసుకున్నారాయన.  జ‌న‌సేన అభ్య‌ర్ధి సుంద‌ర‌పు విజ‌య్ కుమార్ మాత్రం నియోజ‌క‌వ‌ర్గ స‌మస్య‌ల‌పై మోకాళ్ల‌పై నిల‌బ‌డి నిర‌స‌న తెలిపారు. రెండు పార్టీల నాయ‌కుల అవినీతిని ఎండ‌గ‌ట్టాలంటే విజ‌య్ కుమార్ ను గెలిపించాలి. అనకాపల్లి ఎంపీ గా చేసిన అవంతి శ్రీనివాస్ లోకసభ లోకి వెళ్లి నిద్ర పోతారు. ఇలాంటి వాళ్ళనా మనం ఎన్నుకునేది.

* పుట్టగానే ఎవరూ పెద్ద నాయకులైపోరు

60 ఏళ్ల నిండిన ప్ర‌తి రైతుకు రూ. 5 వేలు పింఛ‌న్ వ‌చ్చేలా రైతు పెన్ష‌న్ ప‌థ‌కంపై తొలి సంత‌కం పెడ‌తాను. అలాగే రూ. 8వేలు సాగు సాయం అందిస్తాం. కుటుంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా, ఆదాయంతో సంబంధం లేకుండా ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్ అందించే  ప‌థ‌కం మీద రెండో సంత‌కం చేస్తాం. ఏడాదికి ఆరు నుంచి ప‌ది సిలిండ‌ర్లు ఉచితంగా జ‌న‌సేన ప్ర‌భుత్వం అంద‌చేస్తుంది.  త‌దుప‌రి సంత‌కం రేష‌న్ బియ్యం, ప‌నికిరాని పామాయిల్‌తో ఇబ్బందులు ప‌డుతున్న మీ కోసం రేష‌న్‌కి బ‌దులు రూ. 2500 నుంచి రూ. 3500 వంద‌లు మ‌హిళ‌ల ఖాతాల‌కి జ‌మ చేసే ప‌థ‌కంపై పెడ‌తాను.  ఆడ బిడ్డ‌ ప్ర‌తి ఇంటికి మ‌హాల‌క్ష్మీ అంటాం.

అటువంటి మ‌హాల‌క్ష్ముల‌ వివాహానికి “మా ఇంటి మ‌హాల‌క్ష్మీ” ప‌థ‌కం కింద ల‌క్ష రూపాయ‌లు అందిస్తాం, అలాగే “పుట్టింటి సారె” కింద ప‌దివేలనూట‌ప‌ద‌హార్లు ఇస్తాం. 3 ల‌క్ష‌ల బ్యాక్ లాగ్ పోస్టుల‌ను ఆరు నెల‌ల్లో భ‌ర్తీ చేస్తాం.  58 ఏళ్ల నిండిన మ‌త్స్య‌కారుల‌కు రూ.5 వేలు పెన్ష‌న్ అందిస్తాం. మ‌త్స్య‌కారుల‌కు ప్ర‌త్యేకించి గృహ‌స‌ముదాయాలు ఏర్పాటు చేస్తాం. వేట‌కు కావాల్సిన ప‌రిక‌రాలు, బోట్లు అంద‌జేస్తాం. ప్ర‌తి మండ‌లానికి డిగ్రీ కాలేజ్ , పాలిటెక్నిక్ కాలేజ్ , స్కిల్ డెవ‌ల‌ప్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తాం. పోటీ ప‌రీక్ష‌లకు సిద్ధం అయ్యే విద్యార్ధులు సంవ‌త్స‌రానికి ఒక్క‌సారి ఫీజు కట్టే విధానాన్ని తీసుకొస్తాం. ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్ధుల‌కు ఉచిత ల్యాప్ టాప్ అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

జ‌న‌సేన పార్టీలో  పెద్ద నాయ‌కులు లేరు అంటారు. పుట్ట‌గానే ఎవ‌రు పెద్ద నాయ‌కులు అయిపోరు. స్థానిక ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు స్టీల్ యార్డులో స్క్రాపు అమ్ముకునే వారు. ఆయ‌న ఎమ్మెల్యే కాలేదా..?  రెండేళ్లు జైల్లో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవ్వాలనుకుంటే మా అభ్య‌ర్ధి సుంద‌ర‌పు విజ‌య్ కుమార్ ఎమ్మెల్యే అవ్వ‌కూడ‌దా..?. జ‌న‌సేన పార్టీ మార్పు కోసం వ‌చ్చింది.  ఎన్నిక‌ల్లో గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి అన‌కాప‌ల్లి లోక్ స‌భ అభ్య‌ర్ధి  చింతాల పార్థ‌సార‌ధి,  య‌ల‌మంచిలీ అసెంబ్లీ అభ్య‌ర్ధి సుంద‌ర‌పు విజ‌య్ కుమార్ , పాయ‌క‌రావుపేట అసెంబ్లీ అభ్య‌ర్ధి నక్కా రాజ‌బాబుగారిని అఖండ మెజార్టీతో గెలిపించాల‌”ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here