Home Actor రెండేళ్లు జైల్లో ఉన్న జగన్ కు నన్ను విమర్శించే హక్కు లేదు – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

రెండేళ్లు జైల్లో ఉన్న జగన్ కు నన్ను విమర్శించే హక్కు లేదు – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

104
0


2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే..18 నెల‌ల్లో వెలుగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్ర‌కాశం జిల్లా క‌రవును పార‌ద్రోలుతామ‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు. జిల్లాలో కిడ్నీ బాధితుల స‌హాయార్ధం రూ. 500 కోట్లు విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. దేశానికి సేవ చేసే సైనిక కుటుంబాల‌కు సేవ చేసే భాగ్యం జ‌న‌సేన తీసుకుంటుంద‌ని, సైనికుల‌కు ఇళ్ల స్థ‌లాలు, వారి పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక సైనిక పాఠ‌శాల‌లు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్ధుల కోసం జిల్లాలోని ప్ర‌తి నియోజక‌వ‌ర్గంలో కోచింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరులో బ‌హిరంగ సభ నిర్వ‌హించారు.

ఈ వేదిక నుంచి శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. “ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి గెలుపొందిన నేల గిద్ద‌లూరు. ఇక్క‌డ ప్ర‌జ‌లు ఎలాంటి  అభివృద్ధి కోరుకుంటున్నారో అలాంటి అభివృద్ధిని జ‌న‌సేన పార్టీ చేసి చూపిస్తుంది. ప్ర‌కాశం జిల్లా నుంచి అత్య‌ధికంగా వ‌ల‌స‌లు వెళ్లిపోతున్నారు. వాటిని నిలువ‌రిస్తాం. క‌నిగిరిలో పెరిగిన‌వాడిని, ఒంగోలులో ఓన‌మాలు దిద్దిన‌వాడిని ప్ర‌కాశం జిల్లాను ఏ నాయ‌కుడు చేయ‌లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాను.

* మోడీ ముందు మోకరిల్లడం నావల్ల కాదు

ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారు నా పేరు ప‌ల‌క‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌టం లేదు. చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ అని, యాక్ట‌ర్ అని పిలుస్తున్నారు. ఆయ‌న‌కు ఒక‌టే చెబుతున్నాను. నేను యాక్ట‌ర్ ను కాద‌ని ఏనాడు చెప్ప‌లేదు. యాక్టింగ్ వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన న‌న్ను మీరు యాక్ట‌ర్ అని పిలిస్తే .. రెండేళ్లు జైల్లో ఉండి వ‌చ్చిన మిమ్మ‌ల్ని నేను ఏమ‌ని పిల‌వాలి..?. జాతి పిత మహాత్మా గాంధీలా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారా..  గొప్ప‌గా చెప్పుకోవ‌డానికి.  ప్ర‌జ‌ల సొమ్మును అడ్డంగా దోచుకుని జైలుకు వెళ్లారు.

నేను చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ అయితే… మీరు బీజేపీ పార్ట‌న‌రా..? అమిత్ షా పార్ట‌న‌రా..?. తెలుగుదేశం పార్టీకి స‌పోర్టు చేయాలంటే ధైర్యంగా పొత్తు పెట్టుకునేవాడిని నాకేంటి భ‌యం. మీలాగా చీక‌ట్లో బీజేపీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, అమిత్ షా కాళ్లు మొక్కి, మోడీ గారి ముందు మోక‌రిల్ల‌డం నా వ‌ల్ల కాదు. ఆంధ్రుడిని, తెలుగువాడిని, త‌ల తెగిపోవాలిగానీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఆత్మ‌గౌర‌వం తాక‌ట్టు పెట్ట‌ను. జ‌న‌సేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గానీ, తెలుగుదేశం పార్టీతో గానీ క‌లిసి పోటీ చేయ‌దని, ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని సంవ‌త్స‌రం క్రిత‌మే చెప్పాను. దానికి త‌గ్గ‌ట్టే ఇవాళ మాయ‌వ‌తి గారితో, వామ‌ప‌క్షాల‌తో క‌లిసి కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్నాం. ఆ విషయం నేను స్పష్టంగా చెప్పాను. నాలాగా జగన్ బ‌హిరంగంగా చెప్పగలరా?.. టీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాన‌ని. దానికి డొంక‌ తిరుగుడు దేనికి..?

 బ‌ల‌మైన సామాజిక మార్పు కోసం 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపిస్తే.. మీ నాన్న‌గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు దాన్ని న‌లిపేశారు. మ‌ళ్లీ జ‌న‌సేన‌ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తే ఇది 2009 కాదు 2019 గుర్తు పెట్టుకోండి. నేను అవ్వ‌డానికి యాక్ట‌ర్ నే కావ‌చ్చు కానీ  ప‌బ్లిక్ పాల‌సీలు చ‌దువుకున్న‌వాడిని. మీలాగా జైల్లో కూర్చొని ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వాల‌ని ప్లాన్ చేయ‌లేదు. జైల్లో రెండేళ్లు గ‌డిపిన మీకు న‌న్ను విమ‌ర్శించే హ‌క్కు ఎక్క‌డుంది? మీరు ప‌ద్ద‌తిగా మాట్లాడితే.. నేను ప‌ద్ద‌తిగా మాట్లాడ‌తాను. మీరు తెగించి మాట్లాడితే  మార్పు కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వాడిని నేనెంత తెగిస్తానో ఊహించుకోండి. బీసీ స‌భ‌లు పెట్ట‌డం కాదు. ఎంత‌మంది బీసీల‌కు టికెట్లు ఇచ్చారో చెప్పండి అని ప్ర‌శ్నించారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here