Home Political News రేపటి తరం శ్రేయస్సు కోసం… రాజకీయ జవాబుదారీతనం కోసం.. జ‌న‌సేన క‌వాతు..!

రేపటి తరం శ్రేయస్సు కోసం… రాజకీయ జవాబుదారీతనం కోసం.. జ‌న‌సేన క‌వాతు..!

144
0

చుట్టూ చీకటి అలుముకున్నా… గుండెల నిండా ధైర్యంతో… రేపటి తరం భవిత కోసం కదం తొక్కి కవాతు చేసి పాలకులను బలంగా నిలదీయాలని పిలుపునిచ్చారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ పిలుపు అందుకున్న జనసేన సైనికులు… జనసేనానితోపాటు  పదం కలిపి కదం తొక్కేందుకు స‌న్నాద్దం అయ్యారు. గోదావరి నది పై సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు నిర్మించిన బ్యారేజిపై జనసేన భారీ ఎత్తున కవాతు కార్యక్రమం నిర్వహిస్తోంది.

పిచ్చుక లంకలో మధ్యాహ్నం 3 గంటలకు కవాతు మొదలవుతుంది. 2 .5 కిమీ పొడవు ఉండే కాటన్ బ్యారేజి పై సాగే ఈ కవాతు ధవళేశ్వరం చేరేందుకు గంటన్నర సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరంలో  ఏర్పాటు చేసిన సభాస్థలి వరకూ కవాతు ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్  ప్రసంగిస్తారు. కవాతు లక్ష్యాన్ని ఈ వేదిక నుంచి తెలియచేస్తారు.’కవాతు- మన లక్ష్యం కోసం. కవాతు… మన ధ్యేయం కోసం. కవాతు.. మన రేపటి కోసం. కవాతు… మన బిడ్డల కోసం’ అనే ధృడ చిత్తంతో శ్రీ పవన్ కళ్యాణ్ ఈ కవాతుకు శ్రీకారం చుట్టారు.

నవ శకం రాజకీయాలు ఆరంభం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటి వరకూ రాజకీయ నాయకులకీ, ప్రజా ప్రతినిధులకీ జవాబుదారీతనం అనేది లేదు. ఇక పై జవాబుదారీతనం లేని రాజకీయాలను అంగీకరించే ప్రసక్తి లేదని శ్రీ పవన్ కళ్యాణ్  బలంగా చెబుతున్నారు. ఇచ్చిన హామీలకు తప్పకుండా పాలకులు కట్టుబడి ఉండాల్సిందే. ఆ హామీలను నెరవేర్చకపోతే ప్రజలకు హేతుబద్ధమైన కారణాలు వివరించాల్సిందే. నవ శకం రాజకీయాలు, జవాబుదారీతనం ఉన్న రాజకీయ విధానాలు, రీకాల్ చేసే విధానం రావడం.. తదితర అంశాల ఆవశ్యకతను ఈ కవాతు తెలియచేస్తుంది. రాజకీయాల్లో పెనుమార్పులకు ఇవి చాలా అవసరం. ఇవి లేకపోవడం మూలంగానే రాష్ట్రం ఏ విధంగా దెబ్బ తిందో అవగతం చేస్తోంది ఈ కవాతు.

ఈ కవాతుకు 13 జిల్లాల నుంచి జన సైనికులు తరలి వస్తారు. వీరమహిళ విభాగం కార్యకర్తలు ఈ కవాతులో పాలుపంచుకుంటారు. అన్ని కుల వృత్తులవారు హాజరై… తమ వృత్తుల ప్రాధాన్యం, విలువలను తెలియచేయడంతోపాటు, పాలకుల నిర్లక్ష్యంతో ఆ వృత్తులు ఎలా మసకబారుతున్నాయో కూడా వివిధ కళారూపాల ద్వారా తెలుపుతారు. జానపద కళారూపాల ప్రదర్శనకీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కవాతు కోసం ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. సినీ గీత రచయిత శ్రీ రామజోగయ్య శాస్త్రి రాయగా, సంగీత దర్శకుడు శ్రీ థమన్ స్వరాలు సమకూర్చారు. ఈ గీతం ప్రారంభంలో, మధ్యమధ్యన శ్రీ పవన్ కళ్యాణ్ కొన్ని కవితలు వినిపించారు. ప్రఖ్యాత కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ‘రాహువు పట్టిన పట్టు…’ లాంటి కవితలు ఇందులో ఉన్నాయి. ప్రజలను ఉత్తేజితుల్ని చేసేలా, గమ్యాన్ని నిర్దేశించేలా ఆ గీతం సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here