Home Political News రైతుల డిమాండ్ల‌కు కేంద్రం అంగీకారం – ఇది అన్న‌దాత‌ల విజ‌యం..!

రైతుల డిమాండ్ల‌కు కేంద్రం అంగీకారం – ఇది అన్న‌దాత‌ల విజ‌యం..!

95
0
3530b709-0e3e-4e11-9687-7f78c976783e

రైతులు త‌మ‌ డిమాండ్లను పరిష్కరించాలని భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబరు 23న ఉత్తరాఖండ్‌ నుంచి ట్రాక్టర్లు, ట్రాలీలతో కిసాన్‌ క్రాంతి యాత్ర మొదలయింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకోవాలనేది వీరి ఉద్దేశ్యం. యూపీ నుంచి ఢిల్లీలోకి ప్రవేశిస్తుండగా.. సరిహద్దుల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి నిరసన చేస్తున్న రైతులను అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు జల ఫిరంగులను, రబ్బరు బుల్లెట్లు, భాష్ఫవాయు గోళాలను ప్రయోగించారు. అయినా రైతన్నలు వీటిని పట్టించుకోలేదు. ఆందోళనలో దాదాపు 25 వేలమంది రైతులు పాల్గొన్నారు.

త‌మ డిమాండ్ల పరిష్కారం కోసం వేలాది మంది రైతులు 10 రోజులుగా చేస్తున్న నిరసన ప్రదర్శనకు ఎట్టకేలకు ముగింపు పలికారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న వారిని నగరంలోకి అనుమతించడంతో కిసాన్‌ ఘాట్‌ వద్ద పాదయాత్ర ముగించారు. 10 రోజులుగా యాత్ర చేస్తున్న రైతన్నలు కందిపోయిన పాదాలతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కిసాన్‌ ఘాట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం తమతో ఒప్పందానికి వచ్చిందని, తాము చేస్తున్న డిమాండ్లలో చాలా వరకూ నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించిందని రైతులు తెలిపారు.

ఇది అన్నదాతల విజయంగా భారత్‌ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు నరేశ్‌ తికైత్‌ వెల్లడించారు. భాజపా ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు అమలు పర్చడంలో విఫలమైందని విమర్శించారు. బుధవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో కిసాన్‌ ఘాట్‌ నుంచి రైతులు తిరుగు పయనమయ్యారు.పంట దిగుబడులకు ధరలు పెంచాలనే తమ ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిందని రైతులు తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన ఆరు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ‌ భారత్‌ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ తికైత్ తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here