Home Political News శ్రీకాకుళం ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో ఆదుకోవాలి – గవర్నర్ నరసింహన్ కి నివేదిక అందజేసిన పవన్...

శ్రీకాకుళం ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో ఆదుకోవాలి – గవర్నర్ నరసింహన్ కి నివేదిక అందజేసిన పవన్ కళ్యాణ్..!

95
0

తిత్లీ తుపాన్ కలిగించిన నష్టంతో శ్రీకాకుళం జిల్లా కోలుకునేందుకు కనీసం 15 ఏళ్ళుపైనే పడుతుందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జిల్లాలోనే ఉద్దానం ప్రాంతం చూస్తే గతంలో ఎంతో పచ్చగా ఉండేదనీ, ఇప్పుడు తుపాన్ మూలంగా విధ్వంసం జరిగిందన్నారు. కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలను ఆదుకోవాలన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ నరసింహన్ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. పార్టీ అధ్యక్షులతోపాటు  జనసేన నాయకులు శ్రీ మాదాసు గంగాధరం, శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ తోట చంద్ర శేఖర్ గవర్నర్ ను కలిసినవారిలో ఉన్నారు.

తిత్లీ తుపాన్ మూలంగా శ్రీకాకుళం జిల్లా ఏ విధంగా నష్టపోయిందో తెలిపే నివేదికను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేసి అక్కడ ప్రజలుపడుతున్న బాధల్ని వివరించారు. ఆ ప్రాంత ప్రజలకు అందించాల్సిన సహాయం, అందుకు సంబందించిన ప్రతిపాదనలు, డిమాండ్లతో కూడిన పత్రాన్ని అందించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చూసిన పరిస్థితులను చెప్పి అందుకు సంబంధించిన వీడియోలను చూపించారు. సిక్కోలులో ఉన్న పరిస్థితులను ప్రత్యేక దృష్టితో చూడాలని, కేంద్ర బృందాలను తక్షణమే పంపించాలని విజ్ఞప్తి చేశారు. త్వరగా బాధితులను ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను కోరారు.

అనంతరం మీడియాతో శ్రీ పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో 100శాతం రుణమాఫీ   చేయాలి. ఉద్దానం ప్రాంతంలో తీవ్ర స్థాయిలో నష్టం కలిగినా పూర్తిస్థాయిలో బయటికి చూపించలేదు. కేరళలో  తుపాన్ బీభత్సం జరిగినప్పుడు  మొత్తం అందరికీ  తెలిసింది. ఉద్ధానంలో ఇంత జరిగినప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్లకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు పూర్తిగా కోలుకోనేవరకూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ 10 రోజులుగా విద్యుత్ లేదు. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం దీన్నో ప్రచారంగా వాడుకొంటోంది. పచ్చటి ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

ఇన్ని బాధల్లో ఉంటే అవేవీ బయటకు వెళ్లడం లేదనే ఆవేదన, ఆగ్రహంతో స్థానికులు ప్రజా ప్రతినిధులనీ రానీయడంలేదు. ఈ నష్టాన్నీ, ప్రజల బాధల్నీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని గవర్నర్ గారిని కోరాం” అన్నారు. జనసేన నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “తుపాన్ ప్రభావిత ప్రాంతంలో రైతాంగానికి నూరు శాతం రుణ మాఫీ చేయాలని మా ప్రధాన డిమాండ్ గా తెలియచేశాం. ప్రభుత్వం ప్రకటించిన సహాయం కూడా సరిపోదు. ఆ మొత్తాన్ని పెంచాలి. మత్స్యకారులు తమ జీవనోపాధిని పూర్తిగా కోల్పోయారు. వారిని ఆదుకొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు తక్షణం కేంద్రం నుంచి ప్రతినిధి బృందాన్ని పంపించాలని డిమాండ్ చేశాం. శ్రీకాకుళంలోని పరిస్థితిని తెలుసుకుని, మా నివేదికను పరిశీలించి కేంద్రానికి వివరాలు అందజేస్తానని గవర్నరుగారు హామీ ఇచ్చారు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here