Home Actor సాహితీమూర్తి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూత

సాహితీమూర్తి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూత

55
0
సాహితీమూర్తి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కన్నుమూత spiceandhra

సాహిత్య రంగంలో లబ్ద ప్రతిష్ఠులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గురువారం తెల్లవారుఝామున 2.30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. యేడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నేరేడ్ మెట్, ఆర్.కె. పురంలోని తన స్వగృహంలోనే నిద్రలోనే కన్నుమూశారు. ఆయన సతీమణి ఇంద్రగంటి జానకీబాల ప్రముఖ రచయిత్రి. ఆయన కుమారుడు మోహన కృష్ణ సినిమా దర్శకునిగా రాణిస్తున్నారు. కుమార్తె కిరణ్మయి బెంగళూరులో స్థిరపడ్డారు. శ్రీకాంత శర్మ అంత్యక్రియలు అల్వాల్ లోని స్వర్గ్ ధామ్ లో సాయత్రం 4.00 గంటలకు జరుగనున్నాయి.

శ్రీకాంతశర్మ గారి తండ్రి గారైన ఇంద్రగంటి హనమచ్ఛాస్త్రి గారు మహా పండితులు. తండ్రిబాటలోనే శ్రీకాంతశర్మ కూడా సాహిత్య రంగంపై తనదైన ముద్రవేశారు.  కవిత్వం, లలిత గీతం, చలన చిత్ర గీతం, యక్షగానం, కథ, నవల, నాటకం, నాటిక, వ్యాసం, పత్రికా రచన… ఇలా బహు రూపాలుగా శ్రీకాంతశర్మ ప్రతిభ వికసించింది. శ్రీకాంత శర్మ 1944 మే 29న జన్మించారు. ఇటీవలే ఆయన ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు.

శ్రీకాంత శర్మ కొన్ని సినిమాలకు పాటలు కూడా రాశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘నెలవంక’లో 6 పాటలు రాశారు. ఇందులో ‘ఏది మతం…’ పాటకు నేషనల్ అవార్డ్ వస్తుందని ఆ చిత్ర సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు ఎక్సె పెక్ట్ చేశారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే ‘పుత్తడిబొమ్మ’ సినిమాకు రెండు పాటలు, ‘రావు గోపాల్రావు’ చిత్రంలో ఓ పాట రాశారు.

‘కృష్ణమూర్తి – కుక్కపిల్లలు’ అనే టెలీఫిలిమ్ లోనూ ఓ పాట రాశారు. తనయుడు మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘గోల్కొండ హైస్కూల్’లో ‘ఏనాటివో రాగాలు’ పాటను, ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంలో ‘నా అనురాగం’ పాటను, ‘సమ్మోహనం’ లో ‘మనసైనదేదో..’ పాటను రాశారు. 74 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో కూడా ఆయన ‘సమ్మోహనం’ కోసం ఓ ఫుల్ రొమాంటిక్ సాంగ్ రాయడం అందరినీ ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here