తెలంగాణలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సాదాలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశం అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం రమేష్ నివాసాలు, వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్, కడప జిల్లాలో ప్రారంభమైన ఈ దాడుల్లో 100 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సీఎం రమేష్ నివాసం, ఆఫీసుల్లో, కడప జిల్లా పోట్లదుర్తిలోని ఆయన నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు.
సీఎం రమేష్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు సాగుతున్నాయి. సోదాల్లో 15 మంది కమిషనర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. దాదాపు 25 నుంచి 30 చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే..సీఎం రమేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ…ఐటీ సోదాలు చేస్తే అభ్యంతరం లేదు. తెలంగాణ అధికారులను మధ్యవర్తులుగా అంగీకరించం. మాకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం. సోదాలు చేసే ఐటీ అధికారుల పై నమ్మకం లేదు. బయట నుంచి ఏదైనా తీసుకువచ్చి ఇంట్లో పెట్టే అవకాశం ఉంది. ఐటీ సోదాలు సాధారణంగా జరుగుతున్నవి కావు. రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు చేయిస్తున్నారు. రేవంత్ ఇంట్లో సోదాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదు. తప్పు చేస్తే ఉరేయండి. వదంతులను ప్రచారం చేయకండి అన్నారు.