నేనే రాజు నేనే మంత్రి సినిమా సక్సస్ తర్వాత తేజ తెరకెక్కించిన సినిమా సీత. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ఏ.కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, సుంకర రామబ్రహ్మం సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా సక్సస్ అవ్వడం..సీత ట్రైలర్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉండడంతో ఈసారి కూడా తేజ సక్సస్ సాధిస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఈ రోజు (మే 24) సీత సినిమా రిలీజైంది. ఇంతకీ సీత కథ ఏంటి..? తేజ ఈసారి కూడా సక్సస్ సాధించాడా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాల్సిందే..!
కథ – ఆనంద్ మోహనరంగ (భాగ్యరాజ్) మేనల్లుడు రఘరామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). రఘరామ్ చిన్పప్పుడు మేనమామ దగ్గరే ఉండేవాడు. అయితే…ఆనంద్ మోహనరంగ భార్య పెట్టే బాధలు చూడలేక మేనల్లుడుని తీసుకెళ్లి భూటాన్ లో ఉన్న బౌద్దులు దగ్గరకి చేరుస్తాడు. ఇక ఆనంద్ మోహనరంగ కూతురు సీత (కాజల్ అగర్వాల్) ఎవరి మాట వినదు. నా పేరు సీత నేను గీసిందే గీత అనే టైప్.
ఆమెకు డబ్బే లోకం. ఆమె పెద్ద హాటల్ కట్టాలనుకుంటుంది. ఒక స్ధలాన్ని కొంటుంది. అయితే..ఆ స్థలంలో నివాసం ఉంటున్న జనాల్ని అక్కడ నుంచి పంపించేయడానికి ఎమ్మెల్యే బసవరాజ్ గౌడ్(సోనూసూద్) హెల్ప్ తీసుకోవాలనుకుంటుంది. అతన్ని కలిసి చెబితే… ఒక నెల రోజులు తనతో గడిపితే సహాయం చేస్తానంటాడు. అతనితో సహజీవనం చేయడానికి సీత అగ్రిమెంట్ మీద సంతకం చేస్తుంది.
ఆమె పని అయిన తర్వాత అగ్రిమెంట్ గురించి పట్టించుకోదు. బసవరాజ్ ని లెక్క చేయదు. దీంతో ఎమ్మెల్యే బసవరాజ్ ఆమెను ఎలాగైనే సరే…తన దగ్గరకి రప్పించుకోవాలి.. అగ్రిమెంట్ ప్రకారం తనతో సహజీవనం చేయాలని ఆమె పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ టైమ్ లో సీతకు తండ్రి చనిపోయాడని తెలుస్తుంది. కష్టాల్లో ఉన్న సీత ఏం చేసింది..? భూటాన్ లో ఉన్నరఘరామ్ సీతను ఎలా కలిసాడు..? చివరికి సీత అగ్రిమెంట్ ప్రకారం ఎమ్మెల్యే దగ్గరకి వెళ్లిందా..? లేదా..? కష్టాల్లో ఉన్న సీతను రఘరామ్ ఎలా కాపాడాడు అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్..ఈ సినిమాలో అమాయకుడు పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో ఫైట్స్, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో అమాయకుడు పాత్రకు తగ్గట్టుగా నటించాడు. కాజల్ అగర్వాల్ అయితే.. తను అనుకున్నది చేయాలి. అందరూ తన మాటే వినాలి అనుకునే అమ్మాయిగా చాలా చక్కగా నటించింది.
వీరిద్దరి తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర ఎమ్మెల్యే బసవరాజ్ పాత్ర గురించి. సీతను చూసిన వెంటనే సొంతం చేసుకోవాలనుకునే రావణాసురుడు గా విలన్ పాత్రను పోషించాడు. విలన్ అనగానే..ఎక్కువుగా అరవడాలు కాకుండా చాలా సైలెంట్ గా ఉంటూనే విలనిజం చూపించాడు. అప్పడప్పుడు తనదైన శైలిలో నటించి నవ్వించాడు. ఇక మన్నారా చోప్రా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అభిమన్యుసింగ్, బిత్తిరి సత్తి తదితరులు పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ ఫుత్ ఐటమ్ సాంగ్ బాగుంది. అనూప్ సంగీతం… లక్ష్మీ భూపాలు సంభాషణలు బాగున్నాయి. ఫస్టాఫ్ బాగానే ఉంది అనిపించినా..సెకండాఫ్ కి వచ్చేసరికి సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తే…అప్పుడే అయిపోయిందా..? అనిపించాలి. అంతేకానీ..ఇంకా అవ్వడం లేదేంటి..? అనిపించకూడదు. తేజ సెకండాఫ్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టుంటే బాగుండేది.
రేటింగ్ – 2.25/5