Home Political News సీమ వెనకబాటుత‌నం పై అనంత‌పురంలో జ‌న‌సేన‌ దీక్ష

సీమ వెనకబాటుత‌నం పై అనంత‌పురంలో జ‌న‌సేన‌ దీక్ష

91
0
  • బాధ్యత‌ గ‌ల రాజ‌కీయ వ్యవ‌స్ధే జ‌న‌సేన ల‌క్ష్యం
  • స్పెష‌ల్ అగ్రిక‌ల్చర్ జోన్లతో వ్యవ‌సాయాన్ని లాభ‌సాటి చేస్తాం
  • ఉద్యోగ నియామకాల్లో స్థానికత‌కే పెద్దపీట
  • ఆడ‌బిడ్డల భ‌ద్రత‌కు సింగ‌పూర్ త‌ర‌హా చట్టాలు
  • విద్యార్ధుల‌తో స‌మావేశంలో జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

రాయ‌ల‌సీమ అంటే ఫ్యాక్ష‌న్ సీమ కాదు జ్ఞాన సీమ‌ అని జ‌న‌సేన పార్టీ అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మూల‌కు వెళ్లినా సీమ నుంచి వ‌చ్చిన మేధావులు తార‌స‌డ‌తార‌న్నారు. తరిమెల నాగిరెడ్డి, బీఎన్ రెడ్డి, చిత్తూరు నాగ‌య్య వంటి ఎంద‌రో మ‌హానుభావులు పుట్టిన నేల‌ని, ఆట‌పాట‌ల‌కు, అధ్యాత్మిక‌త‌కు పెట్టింది పేరు అన్నారు. ఇలాంటి రాయలసీమను అభివృద్ధి చేయకుండా వెనక్కి నెట్టేశారనీ, ఈ వెనకబాటుతనంపై పాలకుల్ని నిలదీసేందుకు అనంతపురంలో దీక్ష చేస్తాన‌ని వెల్ల‌డించారు.  మంగ‌ళ‌వారం సాయంత్రం అనంత‌పురంలోని  శ్రీ సెవెన్ క‌న్వెన్ష‌న్ హాల్లో విద్యార్ధుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిరుద్యోగం, క‌రువు, వ‌ల‌సలపై విద్యార్ధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు స‌మాధానం చెప్పారు.  శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉపాధి అవ‌కాశాలు రావాలంటే అవినీతి ర‌హిత రాజ‌కీయాలు రావాలి. మ‌న నాయ‌కులు గుడి కోసం గొడ‌వపెట్టుకుంటారు త‌ప్ప..  ప‌రిశ్ర‌మ‌ల కోసం దృష్టిపెట్టరు. ప్రాంతాల‌ను విడగొట్టేందుకు ఉద్య‌మాలు చేస్తారు త‌ప్ప‌, ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌డానికి ఉద్య‌మాలు చేయ‌రు.

  • గూండాలకే విలువ ఇస్తున్నారు

రాయ‌ల‌సీమ నుంచి ఎంతోమంది ముఖ్య‌మంత్రులు, మంత్రులు వ‌చ్చారు కానీ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌లేక‌పోయారు. మ‌న దేశ దౌర్భాగం ఏమిటంటే గుండాలు, రౌడీల‌కు ఇచ్చిన విలువ చ‌దువుకున్న యువ‌త‌కు ఇవ్వ‌రు. చ‌దువు అనే ప్ర‌తిభ‌ను సాధించ‌డం నేర‌మైపోయింది. విద్యావ్యవ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళన చేయాల్సిన తరుణమిది. వ‌ర్సిటీల్లో రాజ‌కీయ ప్రాబ‌ల్యం త‌గ్గిస్తాను. యువ‌త మేధస్సు దేశ నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డే విధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తాం. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఈ ప్రాంతాన్నిస్పెష‌ల్ జోన్ గా గుర్తించి, 2023లోపు ప‌రిశ్ర‌మ‌లు పెట్టి యువ‌త‌కు ఉపాధి క‌ల్పిస్తాం. ప‌రిశ్ర‌మ‌ల్లో 30 శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు ఇచ్చేలా చ‌ట్టం తీసుకొస్తాం.

  • ఎమ్మెల్యేలను నియంత్రించలేని సీఎం

రాజ‌కీయ నాయ‌కులు ర‌క‌ర‌కాల కేసుల్లో ఇరుక్కుపోయి, త‌మ స్వార్ధం కోసం యువ‌త భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌, మ‌రొక కార‌ణమో చెప్పి యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డం లేదు. కోట్లు సంపాధించ‌డానికి మాత్రం విభ‌జ‌న అడ్డంకులు ఉండ‌వు కానీ, ఉద్యోగాలు క్రియేట్ చేయ‌డానికి మాత్రం అడ్డంకులు చూపిస్తారు. కులాలు, మ‌తాలు వేరు చేసే తెలివితేట‌లు ఉంటాయి కానీ.. యువ‌త‌కు మంచి చేసే తెలివితేట‌లు ఉండ‌వు. యువ‌త‌కు మేలు జ‌ర‌గాలంటే బాధ్య‌త‌గ‌ల ప్ర‌భుత్వాలు రావాలి. బాధ్య‌త‌గ‌ల రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డ‌మే జ‌న‌సేన అంతిమ ల‌క్ష్యం.  అర్ధ‌రాత్రి స్త్రీ ఒంట‌రిగా న‌డిస్తే అస‌లైన స్వ‌తంత్ర్యం అని మహాత్మా  గాంధీ చెప్పారు. ఆ ర‌క్ష‌ణ ఎక్క‌డ లేదు. ‘క‌డుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి’ అని ఒక ఎమ్మెల్యే దిగ‌జారి మాట్లాడితే ముఖ్య‌మంత్రి నియంత్రించ‌రు. ఎమ్మెల్యేల‌నే నియంత్రించ‌లేని ముఖ్య‌మంత్రి రౌడీల‌ను ఇకేం నియంత్రిస్తారు.  ఢిల్లీలో ఘోరం జ‌రిగితే త‌ప్ప నిర్భ‌య‌చ‌ట్టం రాలేదు. జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే ఆడ‌బిడ్డ‌ల భ‌ద్ర‌త‌కు బ‌ల‌మైన చ‌ట్టాలు తీసుకొస్తాం. సింగ‌పూర్ త‌ర‌హా చట్టాలు తీసుకొచ్చి కఠినమైన శిక్షలు విధింపచేస్తాం.

  • తెలుగుదేశం పార్టీవి చిత్తశుద్ది లేని ప‌థ‌కాలు

ఎస్. ఈ. జెడ్ ల పేరుతో ల‌క్ష‌లాది ఎక‌రాలు దోచుకుని రైతుల‌ను రోడ్డున ప‌డేయడం బాధాకరం.  డాక్ట‌ర్ల పిల్ల‌లు డాక్ట‌ర్లు అవుతారు, రాజ‌కీయ నాయ‌కుల పిల్ల‌లు రాజ‌కీయ నాయ‌కులు అవుతారు. అన్నం పెట్టే రైతు పిల్ల‌లు మాత్రం కూలీలుగా మిగిలిపోతున్నారు. ఈ ప‌రిస్థితి మారాలి. ఇందుకోసం జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చాక  స్పెష‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ జోన్లు ఏర్పాటు చేసి యువ‌తీ యువ‌కుల‌ను వ్య‌వ‌సాయానికి ద‌గ్గ‌ర చేస్తాం . త‌క్కువ భూమిలో ఎక్కువ పంట‌లు పండే ప‌రిస్థితుల‌ను తీసుకొచ్చి వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మారుస్తాం.  ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వ్య‌వ‌సాయానికి అనుసంధానం చేయాల‌ని కోరుతున్నారు. దాన్ని కూడా ప‌రిశీలిస్తాం. నిరుద్యోగ భృతి ఎన్నిక‌ల స్టంటే త‌ప్ప నిరుద్యోగ యువ‌త‌కు అండ‌గా ఉండ‌టానికి కాదు.  బాబు వ‌స్తే వార‌బ్బాయి లోకేశ్ కు జాబు వ‌చ్చింది త‌ప్ప‌, ఎవ‌రికీ ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వ‌డానికి  స‌వాల‌క్ష నిబంధ‌న‌లు పెట్టిన చంద్ర‌బాబు.. లోకేశ్ కు మాత్రం ఎలాంటి నిబంధ‌న‌లు లేకుండానే ఉద్యోగం ఇచ్చారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం ప‌థ‌కాలు చిత్త‌శుద్ది లేని బూట‌క‌పు ప‌థ‌కాలే. జ‌న‌సేన పార్టీ ప్రాక్టిక‌ల్ గా చేయ‌గ‌లిగే ప‌థ‌కాల‌ను మాత్రమే ప్ర‌జ‌ల‌ ముందుకు తీసుకొస్తుంద‌”ని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here