Home Actor 2018 – హిట్స్..!

2018 – హిట్స్..!

160
0

2018..నిన్న కాక మొన్న వ‌చ్చిన‌ట్టుంది..కానీ..అప్పుడే సంవ‌త్స‌రం అయిపోయింది. కొత్త సంవ‌త్స‌రం 2019 వ‌చ్చేసింది.  పెద్ద సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డం..చిన్న సినిమాలు పెద్ద విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డం..క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందిన పెద్ద సినిమాలు డిజాస్ట‌ర్స్ అవ్వ‌డం…ఇలా 2018 తెలుగు సినిమాకి ఎన్నోఅనుభ‌వాల‌ను అందించింది. 2018లో వ‌చ్చిన సినిమాల్లో హిట్స్ గా నిలిచిన చిత్రాల గురించి క్లుప్తంగా మీకోసం..!

జై సింహ

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన‌ 102వ చిత్రం జై సింహ‌. కె.ఎస్.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ భారీ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  ఇందులో ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య, నయనతార మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయ్యాయి. సంక్రాంతికి బాల‌య్య సినిమా వ‌స్తే..విజ‌యం ఖాయం అనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ ని జై సింహా మ‌రోసారి నిజం చేసింది. స‌క్స‌స్ సాధించింది.

భాగ‌మ‌తి

అరుంథ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి…ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌ట‌కు అవకాశం ఉన్న పాత్ర‌లు పోషిస్తూ…త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌ర‌చుకున్న అందాల తార అనుష్క‌. ఓ వైపు గ్లామ‌ర్ రోల్స్ చేస్తూనే..మ‌రో వైపు పెర్ ఫార్మెన్స్ స్కోప్  ఉన్న పాత్ర‌లు పోషిస్తోన్న అనుష్క న‌టించిన చిత్రం భాగ‌మ‌తి. పిల్ల జ‌మీందార్ ఫేమ్ అశోక్ తెర‌కెక్కించిన భాగ‌మ‌తి చిత్రాన్ని యు.వీ. క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ సినిమా జ‌న‌వ‌రి 26న రిలీజైంది. అనుష్క అందం, అభిన‌యం, అశోక్ క‌థ‌, క‌థ‌నం, త‌మ‌న్ సంగీతం ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి ఘ‌న విజ‌యాన్ని అందించాయి.

ఛ‌లో

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య‌, ల‌క్ష్మిరావే మా ఇంటికి, క‌ళ్యాణ‌వైభోగం, జ్యోఅచ్చుతానంద‌…ఇలా విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదింకున్న‌ నాగ‌శౌర్య న‌టించిన చిత్రం ఛ‌లో. ఈ సినిమా ద్వారా వెంకి కుడుముల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. నాగశౌర్య తల్లితండ్రులు నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 2న ఈ సినిమా రిలీజైంది. డైరెక్ట‌ర్ వెంకి కుడుముల కొత్త‌గా అనిపించే క‌థ‌ను ఎంచుకుని దానికి క‌మ‌ర్షియ‌ల్ హంగులు ద‌ట్టించుకున్న రాసుకున్న క‌థ అవ్వ‌డంతో యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యింది. నాగ‌శౌర్య‌కు మంచి విజ‌యాన్ని అందించింది.

తొలిప్రేమ‌

ముకుంద‌, కంచె, లోఫ‌ర్, ఫిదా…ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టిస్తూ..యూత్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న మెగా హీరో వ‌రుణ్ తేజ్. నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో వ‌రుణ్ తేజ్ న‌టించిన చిత్రం తొలిప్రేమ‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం తొలిప్రేమ‌. ఈ టైటిల్ తో వ‌రుణ్ తేజ్ మూవీ చేయ‌డంతో మ‌రింత‌గా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఎన్నో అంచ‌నాలతో ఫిబ్ర‌వ‌రి 10న తొలిప్రేమ రిలీజైంది.

తొలిప్రేమ ఎలా ఉంటుంది..? చిన్న చిన్న కారణాల వలన ఎలా బ్రేకవుతుంది.  విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలిప్రేమ ఎలా వెంటాడుతుంది అనే అంశాలని చాలా ఆసక్తికరంగా చూపించాడు యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్, రాశీఖన్నాల సహజమైన నటన సినిమాను ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. వ‌రుణ్ తేజ్ కి మ‌రో విజ‌యాన్ని అందించింది.

అ.!

కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన విభిన్న క‌థా చిత్రం అ..! ఈ సినిమా ద్వారా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించ‌డం విశేషం. ఫిబ్ర‌వ‌రి 16న ఈ సినిమా రిలీజైంది. ఈ  సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు చాలా థ్రిల్లింగా ఉంటుంది. ఏమాత్రం ఊహకందని ఈ ముగింపు చూశాకా దర్శకుడ్ని మెచ్చుకోకుండా ఉండ‌లేరు. క‌మ‌ర్షియ‌ల్ గా ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయినా..వైవిధ్య‌మైన చిత్రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఎం.ఎల్.ఎ

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన చిత్రం ఎం.ఎల్.ఎ. మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మార్చి 23న ఈ సినిమా రిలీజైంది. నిర్మాణ ప‌రంగా ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో నిర్మించిన ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్  అంద‌ర్నీ ఆక‌ట్టుకుని క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా… క‌ళ్యాణ్ రామ్ బయటి బ్యానర్స్‌లో చేసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఇది ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడా సెంటిమెంట్ ని కూడా ఎం.ఎల్.ఎ సినిమా బ్రేక్ చేసింది. ఈ విష‌యాన్ని క‌ళ్యాణ్ రామ్ స్వ‌యంగా చెప్ప‌డం విశేషం.

రంగ‌స్థ‌లం

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 30న రంగ‌స్థ‌లం రిలీజైంది. 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో చెవిటి చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించారు. చ‌ర‌ణ్ రెగ్యుల‌ర్ సినిమాల‌నే చేస్తున్నాడు అనే విమ‌ర్శ‌లుండేవి. అయిత‌..చ‌ర‌ణ్ ఆలోచ‌నాలో కూడా మార్పు వ‌చ్చింది. ధృవ సినిమాతో కొత్త‌గా చేయాల‌ని ప్ర‌య‌త్నించి స‌క్స‌స్ అయ్యాడు. రంగ‌స్థ‌లం సినిమాతో ఓ అడుగు ముందుకు వేసి చెవిటి వాడిగా న‌టించాడు. ఇది ఒక ప్ర‌యోగ‌మే అని చెప్ప‌చ్చు. చ‌ర‌ణ్ ఇలాంటి ప్ర‌యోగం చేయ‌డం ఒక ఎత్తైతే..ఈ ప్ర‌యోగం విజ‌యం కావ‌డం మ‌రో ఎత్తు. ఈ భారీ చిత్రం స‌రికొత్త రికార్డులు సృష్టించి బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచింది.

భ‌ర‌త్ అనే నేను

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – బ్లాక్ బ‌ష్ట‌ర్స్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో శ్రీమంతుడు సినిమా రావ‌డం..అది బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో మళ్లీ మ‌హేష్ – కొర‌టాల కాంబినేష‌న్ అన‌గానే ఈ మూవీ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఏప్రిల్ 20న ఈ సినిమా రిలీజైంది. ఈ సినిమాలో మ‌హేష్ బాబు సీఎంగా న‌టించారు. హీరో సీఎం అన‌గా సినిమా అన‌గానే ఒకే ఒక్క‌డు, లీడ‌ర్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. అయితే..ఈ రెండు చిత్రాల‌కు భిన్నంగా ఈ సినిమా ఉండ‌డం..ఎలాంటి క‌న్ ఫ్యూజ‌న్ లేకుండా స్ట్రైయిట్ నెరేష‌న్ తో ఈ క‌థ‌ను చెప్ప‌డం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. మ‌హేష్ బాబు కెరీర్ లో మ‌రో హిట్ మూవీగా నిలిచింది.

మ‌హాన‌టి

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం మ‌హాన‌టి.ఈ చిత్రాన్ని ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఈ సినిమాని నిర్మించింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర‌ను పోషించిన ఈ సినిమాలో స‌మంత రిపోర్ట‌ర్ గా న‌టించారు. ఈ సంచ‌ల‌న చిత్రం మే 9న రిలీజైంది. సావిత్రి జీవితాన్ని వెండి తెర పై ఆవిష్క‌రించాల‌నుకోవ‌డం ఓ సాహ‌సం. ఈ సాహ‌సాన్ని ఎలాంటి వివాదాలు రాకుండా అద్భుతంగా తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్. రెగ్యులర్‌ కమర్షియల్ సినిమాలా కాకుండా ఓ క్లాసిక్‌లా సినిమాను రూపొందించారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడుకి సావిత్రి కాలంలోకి వెళ్లి ఆమె జీవితాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగించారు. కీర్తి సురేష్, దుల్క‌ర్ స‌ల్మాన్ న‌ట‌న‌, నాగ్ అశ్విన్ క‌థ‌నం, మిక్కీ జే మేయ‌ర్ సంగీతం..వైజ‌యంతీ మూవీస్ నిర్మాణం….ఇలా అన్ని విభాగాలు క‌లిసి అద్భుత చిత్రాన్ని అందించారు.

స‌మ్మోహ‌నం

సుధీర్ బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం స‌మ్మోహ‌నం. అష్టాచ‌మ్మా, జెంటిల్ మేన్, అమీ తుమీ..ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఇంద్ర‌గంటి ఈసారి స‌మ్మోహ‌న ప‌రిచే ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇందులో సుధీర్ బాబు – అదితిరావు హైద‌రీ జంట‌గా న‌టించారు. జూన్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. వైవిధ్య‌మైన  ప్రేమ‌క‌థ‌కు బ‌ల‌మైన ఎమోష‌న్స్, కామెడీని జోడించి మ‌న‌సుకు హ‌త్తుకునేలా తెర‌కెక్కించారు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ చిత్రం  ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌న ప‌రిచింది. సుధీర్ బాబుకు ఓ మంచి విజ‌యాన్ని అందించింది.

ఆర్ఎక్స్ 100

అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. బోల్డ్ కంటెంట్ తో రూపొందిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ మూవీ టైటిల్, పోస్ట‌ర్ & టీజ‌ర్ డిఫ‌రెంట్ గా ఉండ‌డంతో ఈ మూవీ పై యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. జులై 12న ఈ సినిమా రిలీజైంది.  సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసిన అజ‌య్ భూప‌తి ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యారు. హీరోయిన్ క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉండ‌డం..క‌థ‌నం కూడా ఇంట్రస్టింగ్ గా ఉండ‌డంతో యూత్ ని బాగా ఆక‌ట్టుకుంది. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా రూపొందిన ఈ సినిమా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి  చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యాన్ని సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

వైఫ్ ఆఫ్ రామ్

మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం వైఫ్ ఆఫ్ రామ్. ఈ చిత్రాన్ని రాజ‌మౌళి శిష్యుడు విజ‌య్ యొలకంటి తెర‌కెక్కించారు. ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ గా రూపొందిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్ & ట్రైల‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో వైఫ్ ఆఫ్ రామ్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.ఈ వైవిధ్య‌మైన చిత్రం జులై 20న రిలీజైంది. మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. భర్త మరణించిన తర్వాత మర్డర్ కేసు మిస్టరీని చేధించడానికి భార్య చేసిన ప్రయత్నమే వైఫ్ ఆఫ్ రామ్. ఇలాంటి కథను హ్యాండిల్ చేసి మెప్పించడం పైకి కనిపించినంత తేలికేం కాదు. అయిన‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ విజ‌య్ చివ‌రి వ‌ర‌కు ఇంట్ర‌స్టింగ్ గా ఉండేలా చాలా బాగా తెర‌కెక్కించారు. మంచు ల‌క్ష్మి న‌ట‌న‌

డైరెక్ట‌ర్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌, నిర్మాణ విలువ‌లు ఈ చిత్రానికి ప్ల‌స్ పాయింట్స్ అని చెప్ప‌చ్చు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న ఈ వైఫ్ఆఫ్ రామ్ మంచి సినిమాగా నిలిచింది.

చి ల సౌ

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన చిత్రం చి ల సౌ. ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌య్యారు. సెన్సిబుల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం న‌చ్చ‌డంతో నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నిర్మించారు. ఆగ‌ష్టు 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు.  సుశాంత్ అర్జున్ పాత్ర‌లో స‌హ‌జంగా న‌టించాడు. సింపుల్ స్టోరీతో ఈ చిత్రాన్ని రాహుల్ ర‌వీంద్ర‌న్ చాలా చక్క‌గా తెర‌కెక్కించాడు. క‌థా,క‌థ‌నం లీడ్ యాక్ట‌ర్స్ న‌ట‌న‌, కామెడీ..ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోవ‌డంతో సుశాంత్ కెరీర్ లో ఓ హిట్ మూవీగా నిలిచింది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ర‌చ‌యిత‌గా కూడా మంచి మార్కులు సాధించాడు.

గూఢ‌చారి

క‌ర్మ‌, కిస్, ర‌న్ రాజా ర‌న్..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన అడివి శేష్ క్ష‌ణం అనే చిన్న సినిమాతో పెద్ద విజ‌యాన్ని సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఆత‌ర్వాత చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మంచి క‌థ‌తో సినిమా చేయాల‌నే ఉద్దేశ్యంతో చాలా క‌థ‌లు విని ఫైన‌ల్ గా త‌నే క‌థ రాసుకుని చేసిన సినిమా గూఢ‌చారి. ఈ చిత్రంలో అడివి శేష్‌, శోభితా ధూళిపాళ జంట‌గా న‌టించారు. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ,  అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆగ‌ష్టు 3న ఈ సినిమా రిలీజైంది.  స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ గూఢ‌చారి. తెలుగు తెర మీద బాండ్ తరహా చిత్రాలు వ‌చ్చి చాలా ఏళ్లు అయ్యింది. ఈ జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అలాంటి ఓ రేర్‌ కాన్సెప్ట్‌తో అడివి శేష్ ఈ కథను తయారు చేసుకున్నారు. టాలీవుడ్ మూవీనా..?  లేక హాలీవుడ్ మూవీనా..?  అనేంత‌గా మంచి క్వాలిటీతో ఈ సినిమాని రూపొందించారు. సెల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జున సైతం గూఢ‌చారి సినిమాని చూసి ఫిల్మ్ మేక‌ర్స్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని ప్ర‌శంసించారంటే…ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ సినిమా ద్వారా యార్ల‌గ‌డ్డ సుప్రియ రీ ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే..అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించి  బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచింది.

గీత గోవిందం

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం గీత గోవిందం. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం రూపొందింది. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజైంది. డీసెంట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించింది. చాలా స‌హ‌జంగా..ఏమాత్రం బోర్ లేకుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌రోసారి ర‌చ‌యిత‌గాను, ద‌ర్శ‌కుడిగాను ప‌ర‌శురామ్ స‌క్స‌స్ అయ్యాడు. దాదాపు 15 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు 75 కోట్ల షేర్ సాధించి బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచింది.

సెప్టెంబ‌ర్ లో వ‌చ్చిన అల్ల‌రి న‌రేష్ – సునీల్ సిల్లీఫెలోస్ ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్ తో రూపొందిన కంచ‌ర‌పాలెం, స‌మంత న‌టించిన యు ట‌ర్న్ మంచి సినిమాగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రిలీజైన శైల‌జారెడ్డి అల్లుడు మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. నాగార్జున – నాని దేవ‌దాస్, ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌, రామ్ హ‌లో గురు ప్రేమ కోస‌మే ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. విజ‌య‌దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here