Home Movie News
189
0

సినిమా హీరోలు…ప్రేక్ష‌కాభిమానుల్లో వారికుండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సం లేదు. అభిమానులు..త‌మ అభిమాన హీరో గురించి ఏం చేయ‌డానికి సిద్ధ‌ప‌డిపోతుంటారు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే…అభిమానులు ధియేట‌ర్ ద‌గ్గ‌ర చేసే హంగామా అంతా ఇంతా కాదు.  త‌మ హీరోనే గొప్ప అంటే..త‌మ హీరోనే గొప్ప అంటూ వాదించుకోవ‌డాలు..గొడ‌వ‌లు ప‌డ‌డాలు తెలిసిందే. అలాగే కొంత మంది హీరోలు కూడా త‌మ సినిమానే రికార్డ్ క్రియేట్ చేయాల‌ని…ప‌క్కా ప్లాన్ తో రిలీజ్ చేస్తుంటారు. అంతే కాకుండా.. సినిమా టైటిల్స్ విష‌యంలో కూడా హీరోలు పోటీ ప‌డి ఆఖ‌రికి కోర్టుకు వెళ్లిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

అయితే…ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు హీరోల ఆలోచ‌న‌ల్లో కూడా మార్పు వ‌స్తుంది. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ కి మ‌రో స్టార్ హీరో మూవీ రిలీజ్ కి మ‌ధ్య రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా…ఒక స్టార్ హీరో  మూవీ రిలీజ్ అవుతుంటుంటే…ఆ మూవీ ఫంక్ష‌న్ కి మ‌రో స్టార్ హీరో ముఖ్య అతిధిగా హాజ‌రవుతున్నాడు. ఇటీవ‌ల మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను ఆడియో ఫంక్ష‌న్ కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజ‌రై మ‌హేష్ ని అన్నా..అని సంభోధించి ఫంక్ష‌న్ లో సంద‌డి చేసారు.

భ‌ర‌త్ అనే నేను ఆడియో ఈవెంట్ త‌ర్వాత  మ‌హేష్ బాబు పార్టీ ఇస్తే..దీనికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా హాజ‌ర‌య్యాడు. ఇక ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా మ‌హేష్ బాబుకి ఫోన్ చేసి అభినందించారు. అలాగే..ఇటీవ‌ల సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన మ‌హాన‌టి సినిమా అద్భుత విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ టీమ్ ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా అభినందించి ఈ చిత్ర నిర్మాత‌లు ప్రియంకా ద‌త్, స్వ‌ప్న ద‌త్, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ల‌ను శాలువ‌తో స‌త్క‌రించారు.

మ‌హాన‌టి సినిమా కంటే ముందుగా రిలీజ్ అయిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం ఫ్లాప్ అయ్యింది. అయిన‌ప్ప‌టికీ…అల్లు అర్జున్ మ‌హాన‌టి టీమ్ ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించి పార్టీ ఇచ్చారు. ఇటీవ‌ల ర‌వితేజ మూవీ నేల టిక్కెట్టు ఆడియో ఫంక్ష‌న్ కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రై..యూనిట్ ని ఆశీర్వ‌దించారు. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ…ర‌వితేజ ఆడియో వేడుక‌కు రావ‌డం విశేషం. ఇక నితిన్ ఆడియో ఫంక్ష‌న్ అంటే ప‌వ‌న్ ముందుంటారనే విష‌యం తెలిసిందే. ఇలా…నేటి హీరోల్లో చాలా మార్పు వ‌చ్చింది. ఇది శుభ ప‌రిణామం. అయితే..మార్పు రావాల్సింది మాత్రం అభిమానుల్లో. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం.  ఈ విష‌యాన్ని భ‌ర‌త్ అనే నేను ఆడియో వేడుక‌లో స్వ‌యంగా మ‌హేష్ బాబే చెప్పారు.

మేమంతా (హీరోలు) స‌ర‌దాగా క‌లుస్తుంటాం..మాట్లాకుంటుంటాం..కానీ మీరే (అభిమానులు) వేరే హీరోల అభిమానుల‌తో గొడ‌వ‌ప‌డుతుంటారు అన్నాడు. ఈ అభిమానం అనేది మరీ ఎక్కువై పోయి… చావ‌డం..చంప‌డం వ‌ర‌కు కూడా వెళుతుంది. ఇటీవ‌ల ఓ హీరో అభిమాని మ‌రో హీరో అభిమానికి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో అభిమాని చ‌నిపోవ‌డం తెలిసిందే. ఇది చాలా బాధాక‌రం.  హీరోలంద‌రూ ఒక్క‌టే. ఈ విష‌యాన్ని వారే స్వ‌యంగా చెబుతున్నారు. సో..అభిమానుల్లారా…కాస్త ఆలోచించండి..! హీరోలంద‌రూ క‌లిసున్న‌ట్టే…మీరు క‌లిసుంటే ఎంతో బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here